Ditva Cyclone : రెడ్ అలెర్ట్.. ముంచేస్తుందంటరోయ్.. పారా హుషార్

దిత్వా తుపాను దూసుకు వస్తుంది.

Update: 2025-12-01 04:17 GMT

దిత్వా తుపాను దూసుకు వస్తుంది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. నెమ్మదిగా తుపాను కదులుతోంది. రేపు ఉదయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో దిత్వా తుపాను కారణంగా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొద్ది గంటల్లోనే ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు ఉత్తర వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో ద్వితా తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు వంద కిలోమీటర్లకు పైగానే గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాక హెచ్చరించింది. అందుకే తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంత ప్రజలు నేడు ఇళ్లను వదలి బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.

కొన్ని జిల్లాల్లో మాత్రం...
దిత్వా తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నేడు కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు డేంజర్ అని హెచ్చరికలు వినిపించాయి. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు తీర ప్రాంతాల్లో ముప్ఫయి ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
తెలంగాణలోనూ మూడు రోజులు...
దిత్వా తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు నాగర్ కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మూడు జిల్లాల్లో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే మిగిలిన తెలంగాణ జిల్లాల్లో తేలిక పాటి జల్లులు పడతాయని, అంతకు మించి పెద్దగా దిత్వా ప్రభావం ఉండదని తెలిపింది. మరొక వైపు ఈ తుపాను కారణంగా చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్ నగరంలోనూ ఇప్పటికే చలితీవ్రత పెరగడంతో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాలు చేసే వారి ఉదయం పది గంటల తర్వాత మాత్రమే చేయాలని, పొగమంచు కారణంగా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.


Tags:    

Similar News