Tirumala : తిరుమలలో రద్దీ తగ్గినా హుండీ ఆదాయం ఏ మాత్రం తగ్గలేదుగా?

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. మంగళవారం భక్తుల రద్దీ పెద్దగా లేదు

Update: 2025-05-13 03:14 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. మంగళవారం భక్తుల రద్దీ పెద్దగా లేదు. గత కొన్ని రోజుల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల సంఖ్య తగ్గిందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. క్యూ లైన్లన్నీ నిండిపోతాయి. దర్శనానికి ఇరవై గంటలకుపైగానే సమయం పడుతుంది. అలాంటిది గత రెండు రోజుల నుంచి భక్తులు రాక తిరుమలలో తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

అది తప్పుడు ప్రచారమే...
అయితే శ్రీవాణి టిక్కెట్లు పెద్దసంఖ్యలో మిగిలిపోతున్నాయన్న వార్తల్లో నిజం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రోజుకు ఎనిమిది వందల శ్రీవాణి టిక్కెట్లను జారీ చేస్తున్నామని, పదో పరకో మిగులుతున్నాయి తప్పించి వందల సంఖ్యలో శ్రీవాణి టిక్కెట్లు మిగలడం లేదని టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని టీటీడీ హితవు తెలిపింది. ఏడు కొండల వాడి హుండీ ఆదాయం కూడా ఏ మాత్రం తగ్గలేదని అధికారులు తెలిపారు. వాస్తవాలను తెలియజేయాలని అన్నారు.
పది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,760 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,544 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News