Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఇంత పెరిగిందా?
తిరుమలలో్ నేడు భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారమయినా భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శంచుకుంటున్నారు
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మంగళవారమయినా భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శంచుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. సహజంగా మంగళవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. అయితే స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ రోజు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితేభక్తులు అధిక సంఖ్యలో రావడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న ప్రసాదాలను, మజ్జిగలను క్యూ లైన్లలోనే పంపిణీ చేస్తున్నారు. ఎండ వేడిమి నుంచి కాపాడేలా అన్ని చర్యలను టీటీడీ అధికారులు తీసుకున్నారు.
మే నెల కోటా టిక్కెట్లను...
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా నేడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఫిబ్రవరి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.
ఈ నెల 21న...
ఫిబ్రవరి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదలవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 21న వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,784 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,521 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.29 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.