Tirumala : తిరుమలలో నేటి భక్తుల రద్దీ ఎలా ఉందంటే? సోమవారం అయినా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు

Update: 2025-04-21 03:38 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. వేసవి సెలవులతో పాటు పరీక్షల ఫలితాలు వెల్లడి అవుతుండటంతో ఒక్కసారిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇంటర్ ఫలితాలు ఏపీలో వచ్చేశాయి. రేపు తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వస్తున్నాయి. దీంతో రాను రాను వేసవిలో అంటే మరో రెండు నెలల పాటు భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా...
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు కొన్ని సూచనలు చేశారు. ద‌ర్శ‌న టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే రావాలని తెలిపారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా అన్నప్ర‌సాదాలు పంపిణీ చేసేందుకు మొబైల్ ఫుడ్ వెహిక‌ల్స్ ను ప్రారంభించారు. క్యూ లైన్ లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భ‌క్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటూ మార్పులు చేర్పులు చేపడుతున్నారు. వేసవి సెలవులు,వారంతపు సెలవుల నేపథ్యంలో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుందని, స‌ర్వ ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తుల‌కు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా స‌మ‌న్వ‌యంతో ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నారు.
పన్నెండు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యా కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉదయం ఉచిత దర్శనం కోసం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటలకుపైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 82,476 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News