Pithapuram : పిఠాపురం విషయాన్ని పవన్ తేల్చేశారుగా? ఇదండీ సంగతి
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన రెండుగా చీలిపోయాయన్న విమర్శలకు చెక్ పడింది
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన రెండుగా చీలిపోయాయన్న విమర్శలకు చెక్ పడింది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.వర్మ కలసి నడవడంతో అవన్నీ ఒట్టొట్టిదేనని తేలిపోయింది. పవన్ కల్యాణ్, ఎన్.వి.వి.ఎస్. వర్మ ల మధ్య సఖ్యత బాగానే ఉందని, ఇందులో సందేహించాల్సిన పనిలేదన్న సంకేతాలను బలంగా పంపగలిగారు. పవన్ కల్యాణ్ పిఠాపురి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో తొలి నుంచి ఆసాంతం పవన్ వెంటనే వర్మ కూడా కలసి తిరగడం, ఆయనకు పవన్ ఇచ్చే ప్రాధాన్యతను చూసిన తర్వాత విమర్శలకు కూడా నోట మాట రాలేదు.
గత కొద్ది రోజులుగా...
గత కొద్ది రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయి టీడీపీ, జనసేన కార్యకర్తలు నినాదాల యుద్ధానికి దిగారన్న వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో జై వర్మ... జై టీడీపీ అంటూ నినాదాలు మారుమోగిపోవడంతో పాటు అంతకు ముందు జననేన ఆవిర్భావ సభలో పిఠాపురం విజయంపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు అన్నీ కలిపి ఈ కాంట్రవర్సీకి మరింత ఆజ్యంపోసినట్లయింది. వర్మ వేరే పార్టీకి వెళతారన్న ప్రచారం కూడా జరిగింది. వైసీపీలో చేరడానికి వర్మ అంతా సిద్ధం చేసుకున్నారని, వైసీపీ కూడా వర్మ కు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తుందని కూడా వార్తలు కొన్ని కథనాలు వండి వార్చారు.
ప్రయారిటీ ఎవరికంటే?
అయితే శుక్రవారం పవన్ పర్యటన చూసిన వారికి ఎవరికైనా ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లే. ఎందుకంటే పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా. అలాంటిది తన గెలుపు కోసం కృషి చేసిన వర్మను సైడ్ ఎందుకు చేసుకుంటారన్న ప్రశ్న టీడీపీ నేతలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జనసేన నేతలు, కార్యకర్తలు కూడా పవన్ కల్యాణ్ వర్మకు ఇస్తున్న ప్రయారిటీ చూసైనా ఇకనైనా మౌనంగా ఉండటం మంచిదని పవన్ తన కార్యక్రమం ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో వర్మను ఇన్వాల్వ్ చేయడంతోనే పవన్ కల్యాణ్ తాను ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారో చెప్పారు. అందుకే విమర్శించేవాళ్లతో పాటు.. నేతల ప్రాపకం కోసం జెండాలు పట్టుకుని ఎగిరి గంతులు వేసేవారికి పవన్ కల్యాణ్ పర్యటన సమాధానమయిందని చెప్పాలి.