CPI : "నారా"యణా.. వైసీపీ సంగతి తర్వాత రాజధాని మాట ఏదీ?
సీపీఐ జాతీయ నేత నారాయణ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత కిందకు చేరేలా చేస్తున్నాయి
సీపీఐ జాతీయ నేత నారాయణ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత కిందకు చేరేలా చేస్తున్నాయి. అసలే దేశంలోనే కాదు.. అన్ని రాష్ట్రాల్లో సీపీఐ అనేది ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఏపీలోనూ నారాయణ పూర్తిగా పార్టీని తుడిచిపెట్టడానికి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుంది. నారాయణ చచ్చిపోయిన పామును చంపుతూనే ఉండటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ పై ఇప్పుడు ఎన్ని విమర్శలు చేసినా ఫలితం లేదు. సీపీఐ ఒక్క అడుగు కూడా పైకి లేవదు. పరకామణి కేసులో వెంటనే స్పందించిన సీపీఐ నారాయణ రాజధాని అమరావతి రెండో దశ భూసమీకరణ విషయంలో అసలు మాట్లాడకపోవడం కూడా చర్చనీయాంశమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా పెదవి విప్పడం లేదు
పోరాటమంతా వైసీపీపైనేనా?
ప్రజలకు పనికి రాని వాటిన్నంటినీ నారాయణ పట్టుకుని వేలాడుతున్నట్లే కనపడుతుంది. బిగ్ బాస్ పై పెద్ద పోరాటమే చేస్తున్నాడు. అది అవసరమా? చూసేవారు చూస్తారు. లేకుంటే లేదు. వైసీపీ ఇప్పుడు అధికారంలో లేదు. దానిని ప్రశ్నించి నిలదీసినా ఏ మాత్రం ప్రయోజనం లేదు. అసలు విషయాలను పక్కన పెట్టి రాజధాని అమరావతి కోసం పదకొండేళ్ల క్రితం భూములిచ్చిన రైతులకు అండగా నిలబడాల్సిన నారాయణ అది పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పరకామణి కేసులో సీఐడీ చర్యలు తీసుకుంటుంది. అందులో తప్పు జరిగిందని భావిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ రాజధాని రైతులకు అండగా నిలిచేదెవరు? ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన నారాయణ ప్రతిపక్షాన్ని నిలదీయడంలో అర్థం లేనిదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అసలు వాటిని వదిలేసి...
అసలు నారాయణ తన పార్టీ నిర్ణయాన్ని స్పష్టంగా చెబితే బాగుంటుంది. నాడు రాజధాని అమరావతిలోనే ఉండాలని సీపీఐ ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఉద్యమం చేశారు. అది వైసీపీ ప్రభుత్వ హయాంలో. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేయడంలోనూ, రాజధాని అమారావతి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్నయాలను ప్రశ్నించడంలోనూ నారాయణ ఎందుకో వెనకబడినట్లే కనిపిస్తుంది. బీజేపీతో చేతులు కలిపిన టీడీపీని పరోక్షంగా నారాయణ సమర్ధిస్తున్నారన్న ప్రచారం మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జరుగుతుంది. పరకామణి సంగతి పక్కన పెట్టి నారాయణా.. ఇకనైనా రైతుల పక్షాన నిలిస్తే బాగుంటుందన్న సూచనలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరి నారాయణ మారతారా? లేదా?