Ys Sharmila : పవన్ పై వైఎస్ షర్మిల సెటైర్లు విన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరమన్నారు. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే అవుతుందని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇది పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్న వైఎస్ షర్మిల వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దంటూ హితవు పలికారు.
ఉపముఖ్యమంత్రిగా...
శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే, సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదని వైఎస్ షర్మిల అన్నారు. మూఢ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం మంచిదికాదన్న వైఎస్ షర్మిల ఉప ముఖ్యమంత్రిగా ఇది సబబు కాదని, కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే .. వెంటనే ఉప్పునీటి ముప్పు ను తప్పించాలని షర్మిల డిమాండ్ చేశారు. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపాలంటే 3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టాలిని షర్మిల సూచించారు.