TDP : టీడీపీ నేతలు లైన్ దాటుతున్నారా? ఇలా అయితే ఇరుకున పడటం ఖాయమేగా?

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేవిలా ఉన్నాయి

Update: 2025-04-22 08:26 GMT

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేవిలా ఉన్నాయి. వైఎస్ జగన్ ఇటీవల రాప్తాడులో పోలీసులపై చేసిన కామెంట్స్ ను నాడు టీడీపీ నేతలందరూ ఖండించారు. కానీ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజులురెడ్డి కూడా అదే రకమైన సంచలన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి కొంత ఇబ్బందిని తెచ్చిపెట్లినట్లే కనిపిస్తుంది. వరదరాజులు రెడ్డి సీనియర్ నేత. ఆయన రాజకీయంగా డక్కామొక్కీలు తిన్న నేత. ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా అందులో ఒక అర్థాన్ని వెతుక్కుంటారు. అయితే సొంత ప్రభుత్వంలో ఉండే లోపాలను నాలుగు గోడల మధ్య చెప్పాల్సిన విషయాలు బహిరంగంగా మాట్లాడటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పోలీసులు అవినీతి పరులంటూ...
టీడీపీలో నేతలు లైన్ దాటు తున్నారనడానికి వరదరాజులు రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని అంటున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజులు రెడ్డి పోలీస్‌ శాఖలో అన్ని స్థాయిల్లో అవినీతి ఉందని వ్యాఖ్యానించడం సంచలనమే అయింది. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన అవినీతికి పాల్పడుతున్నారని ఆయన బహిరంగ ఆరోపణలు చేయడం పార్టీ నేతలకు షాక్ కు గురి చేసింది. మద్యం షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉద్యోగంలో చేరింది అక్రమార్జన కోసమా అంటూ వరదరాజులురెడ్డి ప్రశ్నించారు. అక్రమ రేషన్ బియ్యం లారీని డీఎస్సీ వదిలేశారని, ఇందులో భారీగా అక్రమాలు జరిగాయన్న వరదరాజులురెడ్డి డబ్బుల కోసం ఓ ఉన్నతాధికారి ఆదేశాలతో మునివర అనే వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. ఈఅంశాలపై అధికారులకు ఫిర్యాదుచేస్తానని వరదరాజులు రెడ్డి తెలిపారు.
ఆషామాషీగా చేసిన....
వరదరాజులు రెడ్డి ఏదో ఆషామాషీగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండరు. ఏదో మనసులో పెట్టుకుని మాత్రమే ఆయన ఈ కామెంట్స్ చేసి ఉంటారు. ఏదైనా తప్పులు జరిగి ఉంటే నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లవచ్చు. అప్పటికీ తెగకపోతే హోంమంత్రి వంగలపూడి అనితకు చెప్పి ఆ అధికారిని బదిలీ చేయించవచ్చు. అదీ కాకుంటే నారా లోకేశ్ కో, లేకుంటే చంద్రబాబుకో ఫిర్యాదు చేసే అవకాశం కూడా వరదరాజులురెడ్డికి ఉంది. కానీ వరదరాజులు రెడ్డి ఆ పనిచేయలేదు. తన అక్కసును బహిరంగంగా వెళ్లగక్కడంతో ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఇరుకునపడాల్సి వచ్చింది. మంచి బహిరంగంగా చెప్పాలి. చెడు చెవిలో చెప్పాలి అన్న చంద్రబాబు మాటలను కూడా వరదరాజులు రెడ్డి పెడచెవిన పెట్టినట్లే కనిపిస్తుంది.
టీడీపీ హైకమాండ్ సీరియస్...
వరదరాజులు రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నాయకత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ ఆయనను కోరినట్లు తెలిసింది. గతంలోనూ వరదరాజులురెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై సంచలన కామెంట్స్ చేశారు. అయితే అది అధికారంలో లేనప్పడు. చివరకు టిక్కెట్ తెచ్చుకుని, గెలిచిన తర్వాత కూడా వరదరాజులు రెడ్డి తన స్టయిల్ ను మార్చుకోలేదని ఆయన కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. పోలీసులపై ఆరోపణలు చేసే టప్పుడు కొంత జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని, సీనియర్ నేతలే ఇలా గీత దాటుతుంటే ఇక కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారన్న కామెంట్స్ పెద్దయెత్తున వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News