దుర్గగుడిలో కొబ్బరికాయల వివాదం.. అసలేం జరిగిందంటే..

అలా దుర్గగుడిలో వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలకు టెండర్ పాడుకున్న ఆ కాంట్రాక్టర్.. అమ్మవారికి తెచ్చిన కొబ్బరికాయలు..

Update: 2023-06-28 10:58 GMT

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో రోజురోజుకీ కమర్షియాలిటీ పెరుగుతుంది. సాధారణంగా గుడికి వెళ్లే భక్తులు కొబ్బరికాయలు కొనుక్కుని తీసుకెళ్లడం సహజం. అయితే ఆ కొబ్బరికాయలు కొనడానికే కాదు.. కొట్టడానికి కూడా డబ్బులు చెల్లించాలంటే ఏం చేయాలి ? ఇప్పుడు దుర్గగుడిలో చెలరేగిన వివాదం ఇదే. చేతిలో రూ.20 పెట్టు.. కొబ్బరికాయ కొట్టు. ఇదీ అక్కడి కొబ్బరికాయల కాంట్రాక్టర్ సిబ్బంది తీరు. నిత్యం రద్దీగా ఉండే ఆలయాల్లో భక్తులు స్వామి, అమ్మవార్లకు సమర్పించే కొబ్బరికాయలను కాంట్రాక్టర్లు వేలం పాడుకుంటారు.

అలా దుర్గగుడిలో వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలకు టెండర్ పాడుకున్న ఆ కాంట్రాక్టర్.. అమ్మవారికి తెచ్చిన కొబ్బరికాయలు కొట్టాలంటే రూ.20 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుండటం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై గుడిలోని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు ఎందుకు చెల్లించాలి ? అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు కొబ్బరికాయలు కొట్టేందుకు అక్కడ సిబ్బంది ఉండాల్సిన పనేముంది. భక్తులే స్వయంగా కొట్టుకుంటారు కదా.
కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టేందుకు సిబ్బంది ఉన్నా.. ఎంతోకంత చిల్లర అడుగుతారు కానీ.. ఇలా రూ.20 ఇవ్వాలని డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. గతంలో హుండీల లెక్కింపు సమయంలో దొంగతనం చేసిన కె.పుల్లయ్య అనే వ్యక్తి అల్లుడికి ఈ కొబ్బరికాయల కాంట్రాక్టర్ బినామీగా ఉండి.. ఇలా ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్నట్లు టాక్. ఈ వ్యవహారం సోషల్ మీడియాకెక్కడంతోనైనా ఆలయ యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.


Tags:    

Similar News