మాటపై నిలబడి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు : హోం మంత్రి

సీఎం వైఎస్‌ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నేడు అభివృద్ధి దిశగా కొత్త పుంతలు తొక్కుతోందని

Update: 2023-08-20 05:57 GMT

సీఎం వైఎస్‌ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నేడు అభివృద్ధి దిశగా కొత్త పుంతలు తొక్కుతోందని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చి ఇచ్చిన మాటపై నిలబడిన నాయకుడిగా చరిత్ర సృష్టించారని రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వ్యవసాయ ఉత్పాదకత గణనీయంగా పెరిగాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు గతంలో కంటే మెరుగయ్యాయని తెలిపారు.

2014లో జరిగిన రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ఎన్నో కఠినమైన సామాజిక, ఆర్ధిక అసమానతలతో రాష్ట్రం కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితులు సానుకూలంగా మారకపోగా మరింత దిగజారాయన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అయితే సీఎం జ‌గ‌న్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కుల,మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన ఏ ఒక్కరూ సాయం అందకుండా మిగిలిపోకూడదనేదే లక్ష్యంగా నవరత్నాల సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.

విద్య, ఆరోగ్య, రైతు, మహిళా సంక్షేమంలో చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. సచివాలయం వ్యవస్థ, రైతులకు సేవలందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ తదితరాలను ప్రవేశ పెట్టి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ సమర్థ పాలన అందిస్తోందన్నారు. రైతుల కోసం రైతు భరోసా, తల్లులకు అమ్మఒడి, విద్యార్థులకు విద్యా, వసతి దీవెన, స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్యశ్రీ, ఆర్హులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక తదితర ప్రజా కేంద్రీకృత పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికీ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు.

ప్రభుత్వం 75 శాతం సంక్షేమ పథకాలను లబ్ధిదారుల కుటుంబాల్లోని మహిళలకే అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ మహిళా సాధికారికతకు పెద్దపీట వేశామన్నారు. ఇళ్ల పట్టాలు సహా, ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఆరోగ్య సేవలు అందించడం, చుక్కల భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం మొదలైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.


Tags:    

Similar News