Ys Jagan : జగన్ మెడపై వేలాడుతున్న కత్తి.. నిర్ణయం ఎలా ఉంటుందో మరి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా అనర్హత వేటు వేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. రాజ్యాంగ నిబంధనలను అనుసరించి అరవై రోజుల పాటు శాసనసభకు గైర్హాజరయితే ఆ సభ్యుడి పదవి కోల్పోతారు. ఇప్పుడు జగన్ కు కూడా ఆ ప్రమాదం పొంచి ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు జగన్ హాజరయితే భయపడి వచ్చారంటారు. రాకుంటే పదవి పోతుంది. ఇది జగన్ ను ఇరకాటంలోకి నెట్టే విషయమేనని చెప్పాలి. ఎందుకంటే జగన్ ఇప్పటి వరకూ కోరుకున్నది జరగకపోయినా కేవలం పదవి కోసమే వచ్చారన్న ప్రచారం అధికార పార్టీ చేసే వీలుంది.
ఉప ఎన్నిక వచ్చేలా...
ఇప్పటికే జగన్ పై వేటు వేయడానికి అధికార పార్టీ సిద్ధమవుతుంది. ఇటీవల జరిగిన పులివెందుల ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం తర్వాత పులివెందుల శాసనసభకు ఉప ఎన్నిక వస్తే దానిని కూడా సొంతం చేసుకుని వైసీపీని మరింత మానసికంగా అణిచివేయాలన్న ప్లాన్ లో కూటమి పార్టీ ఉంది. అధికార పార్టీ కావడంతో పోలీసుల సహకారంతో పాటు అన్ని రకాలుగా ఉప ఎన్నికల్లో అడ్వాంటేజీ ఉంటుందని భావించి జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే మాత్రం అనర్హత వేటు వేసి పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరపాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. దీంతో జగన్ ఇప్పుడు ఇటు అసెంబ్లీకి వెళ్లలేక, అటు పోకుండా ఉండలేక ఇరకాటంలో పడినట్లే కనిపిస్తుంది.
సీనియర్ నేతలు సలహాలు...
వైఎస్ జగన్ కూడా భేషజాలకు పోవడం మంచింది కాదని వైసీపీలోని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికలో పులివెందులను కోల్పోతే పార్టీ రాజకీయంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెబుతున్నారు. జగన్ కూడా అదే అభిప్రాయంలో ఉండి ఉండవచ్చు. కానీ ఇగో అడ్డం వస్తుంది. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ చెప్పారు. న్యాయపోరాటానికి కూడా దిగారు. అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అవకాశమే లేదని అధికార పార్టీ స్పష్టం చేసింది. దీంతో ప్రతిపక్ష హోదా లేకుండా ఎమ్మెల్యే పదవి కాపాడుకోవాలన్నా, పులివెందులకు ఉప ఎన్నిక రాకూడదని కోరుకున్నా జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. జగన్ నిర్ణయంపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.