Ys Jagan : పవన్ పై జగన్ సెటైర్లు.. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తున్నారంటూ

ముఖ్యమంత్రి జగన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. భీమవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు

Update: 2023-12-29 07:52 GMT

ys jagan

ఈ యాభై ఐదు నెలలుగా ఈ ప్రభుత్వం ఎలా చేయగలిగిందీ ఆలోచించమని జగన్ అన్నారు. భీమవరంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. జగనన్న విద్యాదీవెన కింద నిధులు విడుదల చేశారు. చంద్రబాబు ప్రజల మనస్సుల్లో లేరని, వారికి విశ్వసనీయత లేదని అన్నారు. వాళ్లు బాగుపడటం కోసమే అధికారాన్ని కావాలనుకుంటున్నారని జగన్ అన్నారు. వెన్నుపోట్లు పొడిచే వీళ్ల రాజకీయం అందరికీ తెలుసునని అన్నారు. దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసంలో ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాడు దేశ చరిత్రలో ఎవరూ ఉండరన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు అదే తనకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితమని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో ఉండకూడదని కూడా కోరుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ లు కలసి మ్యానిఫేస్టోలు ఇస్తారట అని ఎద్దేవా చేశారు. మొన్న ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఉమ్మడి మ్యానిఫేస్టో పేరిట ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని జగన్ సెటైర్ వేశారు. ఇలాంటి వారిని నమ్మవచ్చా అని ఆలోచన చేయమని కోరుతున్నానని అన్నారు.

త్యాగాలకు త్యాగరాజు...
ఎన్ని సీట్లు ఇచ్చినా సరే.. ఇవ్వకపోయినా సరే ప్యాకేజీలకు కోసం త్యాగాలు చేసే వారిని ఇప్పుడే చూస్తున్నామని జగన్ అన్నారు. త్యాగాల త్యాగరాజు అంటూ పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు చేశారు. రియల్ లైఫ్ లో ఈ పెద్దమనిషి ముచ్చటగా మూడు సంవత్సరాలు కూడా కాపురం చేసి ఉండరని, మ్యారేజీ స్టార్ పెళ్లి అనే పవిత్ర సంప్రదాయాన్ని మంటగలుపుతున్నాడంటూ మండిపడ్డారు. కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడు ఈ పెద్దమనిషి అంటూ ఫైర్ అయ్యారు. తనకు ఇద్దరు ఆడపిల్లలున్నారని, చెల్లెళ్లున్నారని, ఇలాంటి వాళ్లు నాయకులైతే వారిని స్ఫూర్తిగా తీసుకుని నాలుగేళ్లకొకసారి అదే మాదిరి చేయడం మొదలుపెడితే మన ఆడబిడ్డల పరిస్థిితి ఏంటని ప్రశ్నించారు. 2.45 లక్షల కోట్లు తాము ఈ ఐదేళ్లలో నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశామని జగన్ అన్నారు. ఏ పని చేయని చంద్రబాబును సమర్థించే వారిని ఆలోచన చేయమని అడుగుతున్నానని అన్నారు. పేదల సంక్షేమ పథకాలు కప్పి పుచ్చడానికే రౌండ్ టేబుళ్లు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని గమనించాలన్నారు. తోడేళ్లన్నీ ఏకమై జగన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారన్నారు. వీళ్లెవరికీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదని, అందుకే అందరూ కలసి వంచనను నమ్ముకున్నారని జగన్ మండిపడ్డారు.
బాబుతో బంధం మాత్రం...
రాజకీయంగా తన వివాహబంధం మాత్రం పది పదిహేనేళ్లుండాలని తన క్యాడర్ కు చెబుతున్నాడంటే ఏమనాలి అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా? అని జగన్ ప్రశ్నించారు. ఒకరు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కుటిల నీతిని ప్రజలు ఎండగట్టాలని జగన్ పిలుపునిచ్చారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏదైనా మంచి పనిని గుర్తుపెట్టుకోగలరా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఓటేస్తారా? అంటూ అడిగారు. ఆయన ఎప్పుడైనా ప్రజలకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు మాట్లాడట. పౌర సేవలు ప్రజల ముందుకు తెచ్చింది మీ జగన్ కాదా? గ్రామాల్లో సచివాలయాలు పెట్టింది మీ జగన్ కాదా? వాలంటీర్ల వ్యవస్థను పెట్టింది మీ జగన్ కాదా? అని ఆయన ప్రజలను ఉద్దేశించి అడిగారు. చంద్రబాబు పథ్నాలుగేళ్ల పాలనను, వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనను బేరీజు వేసుకోవాలని జగన్ సూచించారు.
విప్లవాత్మకమైన మార్పులతో...
యాభై ఐదు నెలల్లో ఎన్ని మార్పులు తెచ్చానో కళ్లముందు కనపడుతున్నాయని జగన్ అన్నారు. ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలన్న ఆలోచన రాని పెద్దాయన పాలనను చూశామని అన్నారు. ప్రజలకు మంచి చేయాలని మాత్రం ఆయన తన అధికారాన్ని ఉపయోగించలేదని, దాని ద్వారా వచ్చిన అవినీతి సొమ్మును దుష్టచతుష్టయానికి పంచిపెట్టారన్నారు. చంద్రబాబు పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదని జగన్ అన్నారు. దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చేశారన్నారు. నాలుగున్నరేళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశామన్నారు. ఇంగ్లీష్ మీడియాలను ప్రభుత్వ పాఠశాలలో మొదలుపెట్టి వాటి రూపు రేఖలనే మార్చివేశామన్నారు. 27.61 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్‌మెట్ పథకాన్ని వర్తింప చేశామన్నారు. 584 కోట్ల ఆర్థిక సాయాన్ని జగనన్న విద్యానిధుల కింద జగన్ విడుదల చేశారు. 8.09 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగన్ బటన్ నొక్కి నిధులను జమ చేశారు.

Tags:    

Similar News