Chandrababu : భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో చంద్రబాబు
భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారన్నారు. మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక అని అన్నారు. ప్రాచీన కాలంలో భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందన్న చంద్రబాబు ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందన్నారు. 2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశామని, ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవరం రికార్డు స్థాయిలో నిర్వహించామని చంద్రబాబు తెలిపారు.
యోగాను నూట యాభై దేశాలు...
ఈరోజు యోగాను 150 దేశాలు సాధన చేస్తున్నాయన్న చంద్రబాబు 2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించిందన్నారు. పూర్వ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మనదని, 1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనదని అన్నారు. సున్నాను భారతీయులే కనుగొన్నారకని, మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదేనని చంద్రబాబు అన్నారు. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారతదేశం సొంతమని, అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారని, వీళ్లందరూ మనకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.