Annadatha Sukhibhava : మోదీ వారణాసిలో.. చంద్రబాబు దర్శిలో.. రైతన్నలకు ఒకే రోజు తీపికబురు

అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

Update: 2025-08-02 01:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత వరసగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ పోతుంది. ఈరోజు మరో చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించనుంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండు వేల రూపాయలు చెల్లించనుంది. ఈ నిధులకు మరో ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పీఎం కిసాన్ నిధులను కూడా...
కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత నిధులు అందచేస్తుండగా, కూటమి ప్రభుత్వం ఏపీలో తొలి విడత నిధులను ఈ పథకం కింద రైతులకు అందచేయనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పురుగు మందులు, యూరియా, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు వీలుగా పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నగదును జమచేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తారు. ఏపీలో చంద్రబాబు దర్శినియోజకవర్గంలో విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి పీఎం కిసాన్ పథకం కింద 831.60 కోట్ల రూపాయల నిధులను అందించనుంది. ఈ నిధులను 41.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఏపీలో మాత్రం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అన్నదాత పథకం కింద ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున చెల్లించనుంది. అయితే ఈ పథకం కింద రాష్ట్రంలో 46.64 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీరిని మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ ఈ నిధులు జమ అవుతాయని తెలిపారు. ఈ కేవైసీ పూర్తి చేయని వారికి కూడా భవిష్యత్ లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఇక కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కార్టుల జారీ ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే రెండో విడతలో మొదటి, రెండో విడత నిధులను కలిపి కౌలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెప్పారు. మొత్తం మీద నేడు ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ప్రారంభం కానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News