Mahanadu : ఆర్థిక నేరగాళ్లను రానివ్వబోం.. వచ్చే ఎన్నికల్లోనూ మనదే జయం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తన బలం, బలగం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తన బలం, బలగం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందన్న చంద్రబాబు నాయుడు కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని అన్నారు. అది చాటి చెప్పేందుకే ఇక్కడ మహానాడును నిర్వహించామని చెప్పారు. అహంకారంతో ఊగిపోయిన గత ప్రభుత్వానికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని చంద్రబాబు అన్నారు. వైసీపీకి కేవలం రాయలసీమలో ఏడు సీట్లు వచ్చాయని, అదే కూటమికి కడపలోనే ఏడు స్థానాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. 2029లో్ ఉమ్మడి కడపలో పదికి పది స్థానాలను గెలిచి తీరాలని చంద్రబాబు అన్నారు.
కార్యకర్తల వల్లనే...
గత ఎన్నికల్లో విజయం కార్యకర్తల వల్లనే సాధ్యమయిందన్న ఆయన గత ఐదేళ్లలో రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కనీసం కడపలో తాగేందుకు నీరు కూడా ఇవ్వని పరిస్థితి గత పాలకులదని చంద్రబాబు మండిపడ్డారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని క్రమంగా గాడిలో పెడుతున్నామని చెప్పారు. ప్రజల కోసం కష్టపడి పనిచేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మహానాడు వేదికగా చంద్రబాబు హామీ ఇచ్చారు. 2029 నాటికి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ గా తీర్దిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు కలసి కట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్ అనేది దొరకదని కూడా చంద్రబాబు అన్నారు.
సీమను అన్ని రకాలుగా...
రాయలసీమను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్న చంద్రబాబు జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తవుతుందని, కడపలో స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు జూన్ పన్నెండో తేదీ నాటికి ఐదు వందల సేవలు ఆన్ లైన్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అవినీతి లేని పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చంద్రబాబు వివరించారు. నేరగాళ్లను వదిలి పెట్టే ప్రసక్తి లేదని, ఆర్థిక ఉగ్రవాదులను క్షమించబోమని, వారు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత పతనమవుతుందని, అందుకే అందరం కలసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలని చంద్రబాబు కోరారు. కార్యకర్తలు టీడీపీకి బలం అని, కార్యకర్తలు ఏ నేత విస్మరించినా ఊరుకునే ప్రసక్తి లేదని తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పారు.