Amaravathi : చంద్రబాబు ప్రయత్నంలో లోపం లేదు.. సహకరించాలిగా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ఆశలు పెట్టుకున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడే నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి. ప్రధానినరేంద్రమోదీ రీ లాంచ్ చేసిన తర్వాత అమరావతి పనులు వేగం అందుకున్నాయి. ఇక ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. శాశ్వత భవనాల నిర్మాణాన్ని మొదటిదశ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక ఈ లోపు అమరావతికి అవసరమైన సొబగులు అద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని ఉండేందుకు చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
అన్నీ హంగులతో...
అందులో భాగంగా అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం విజయవాడకు గన్నవరం ఎయిర్ పోర్టు ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇందుకోసం మరో నలభై వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. రైతులు కూడా తమ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే మొత్తం డెబ్భయి వేలఎకరాల్లో రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది.
చుట్టు పక్కల ఉన్న నగరాలను కాదని...
ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా అమరావతిలో నెలకొల్పేందుకు ఢిల్లీ పెద్దలతో నిరంతరం టచ్ లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ముందుకు వస్తే అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలను కూడా అమరావతికి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు తరచూ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చంద్రబాబు చేస్తూనే ఉన్నారు. పెట్టుబడుల కోసం రేపు సింగపూర్ కు బయలుదేరి వెళుతున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలను కాదని అమరావతికి రావాలంటే బిగ్ టాస్క్ అని చెప్పాలి. మరి చంద్రబాబు అటువంటి సమస్య నుంచి అమరావతిని ఎలా ముందుకు తీసుకెళతారన్నది ఆసక్తికరంగా మారింది