Chandrababu : తమ్ముళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. మార్చిలోగా నామినేటెడ్ పదవులు, మే నెలలో జరిగే మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవులకు ఎమ్మెల్యేలతో తిరిగే వారిని కాకుండా పార్టీ కోసం కష్టపడ్డవారిని ఎంపిక చేయాలని సూచించారు. ఆలయ కమిటీ ఛైర్మన్, ఏఎంసీలు కమిటీలు మార్చిలోపు పూర్తి చేస్తామని అన్నారు. సమర్థులకే కో-ఆపరేటివ్ అధ్యక్ష పదవులు ఇవ్వాలని, ఎమ్మెల్యేలు, ఎంపిలు నామినేటెడ్ పదవుల కోసం ప్రతిపాదనలు పోర్టల్‌లో వెంటనే పెట్టాలని, మీరు ఇవ్వాల్సిన డాటా మీరు ఇవ్వకుండా పదవులు అంటే కుదరదని అన్నారు.
పనిచేసే వారికి గుర్తింపు...
పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడూ లేని విధంగా పార్టీ సభ్యత్వాలు కూడా కోటి దాటాయన్నారు.తాను రుణపడి ఉంది కార్యకర్తలకేనని, వారి ప్రాణాలు తీసినా, వేధించినా, కొట్టి కేసులు పెట్టినా పార్టీతోనే ఉన్నారని, కేడర్‌ను కాపాడుకోవడం మన బాధ్యత అని చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహించాలని, పంచాయతీ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలతో సమావేశం నిర్వహించాలని, కార్యకర్తలను ఎంపవర్ చేస్తే మీకు తిరుగుండదని తెలిపారు. మనల్ని నమ్ముకున్న వారిని మనం గౌరవించాలని, టీడీపీకి బీసీలు వెన్నెముకగా ఉంటూ వస్తున్నారని చంద్రబాబు తెలిపారు.