Chandrababu : మంత్రులూ ఇక రోజులు లెక్క పెట్టుకోండి.. చాలా టైం చూశా
మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంకా మంత్రుల పనితీరును మార్చుకోకుంటే ఎలా అని ప్రశ్నించారు. అసలు మంత్రులు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వడంలో కూడా మంత్రులు విఫలమవుతున్నారని, వైసీపీ నేతలు మహిళ ఎమ్మెల్యేలను కించపర్చే విధంగా మాట్లాడినా స్పందించకుండా మౌనం పాటించడమేంటని కటువుగానే ప్రశ్నించారు. మీ స్థానంలో కొత్త వారు వస్తారని కూడా చంద్రబాబు హెచ్చరించారు.
1995 నాటి సీఎంను చూస్తారని...
ఇక తనలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని, ఇప్పటి వరకూ పనితీరును మార్చుకుంటారేమోనని వెయిట్ చేశానని, కానీ కనీసం విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పడంలో కానీ, ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న మంచి పనులను, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంలో కానీ ఫెయిలయ్యారని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ తో పోరాటం అంటే సబ్జెక్ట్ పైనే ఉండేదని, ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ప్రభుత్వం పై చేస్తున్న దుష్ఫ్రచారాన్ని ఎప్పటికప్పడు కౌంటర్ ఇవ్వగలిగేతే మనగలుగుతామని గుర్తుంచుకోవాలని చంద్రబాబు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లుతెలిసింది. కొత్త వారిని మంత్రులుగా తీసుకు రావడం తనకు క్షణాల్లో పని అని, కానీ ఆ పరిస్థితి కొందరు తెచ్చుకునేలా ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
వ్యవసాయశాఖపై...
సరిగా తమకు అప్పగించిన శాఖలపై కనీసం సమీక్షలు నిర్వహించడం లేదని, కొందరు జిల్లాల పర్యటనలకు కూడా వెళ్లడం లేదని ఫైర్ అయ్యారు. విపక్ష నేత జగన్ మిర్చి, పొగాకు ఈరోజు మామిడి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందంటూ రోడ్డెక్కుతుంటే ఒక్కరూ మాట్లాడలేరా? ప్రభుత్వం రైతుల కోసం చేసిన పనిని ప్రజలకు వివరించలేరా? అని గట్టిగానే నిలదీసినట్లు తెలిసింది. వ్యవసాయ శాఖపైనే ఎక్కువగా విపక్షాలు విమర్శలు చేస్తున్నారని, ప్రతి ఒక్క మంత్రి సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రులు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఇవ్వాలని కూడా చంద్రబాబు అన్నారు. అలా చేయకుండా ఉంటే మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తానని గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.