Free Bus for Women : మహిళలకు ఉచిత బస్సు పథకం లో "సూపర్ " ట్విస్ట్

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు

Update: 2025-02-12 07:01 GMT

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి నివేదికను కూడా సమర్పించింది. మరోవైపు రవాణా శాఖ అధికారులు కూడా ఎప్పుడో ఈ పథకం వల్ల ఎంత భారం పడుతుందన్నది స్పష్టంగా తెలిపింది. కర్ణాటక, తమిళనాడుల్లో అమలవులున్న పథకంలో లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్ లో మార్పులు చేయడానికి నిర్ణయించినట్లు తెలిసింది. కర్ణాటక, తమిళనాడుల్లో ఉచిత బస్సు పథకం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ నష్టాల బారిన పడటమే కాకుండా ప్రభుత్వానికి భారంగా మారడంతో పాటు అక్కడ లోపాలు కూడా అమలు తర్వాత బయటపడింది.

అనేక లోటు పాట్లు...
తెలంగాణలో పురుషుకుల సీట్లు లేకపోవడం, మహిళలే ఎక్కువ మంది బస్సులలో ప్రయాణిస్తుండటంతో సీట్లు కూడా దొరకడం లేదు. ముందుగా బుక్ చేసుకునే సదుపాయం లేకపోవడంతో ఉచిత బస్సు పథకంలో ఎక్కువ మంది మహిళలు సీట్లలో కూర్చుని ఉచిత ప్రయాణం చేస్తున్నా, పురుషులు మాత్రం ప్రయాణ టిక్కెట్ చెల్లించి నిల్చుని ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో పురుషుల్లో అసహనం వ్యక్తమవుతుంది. అదనపు బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో పాటు దూరం ప్రాంతాలు అంటే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించాలన్నా నిల్చునే ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఆటో వాలల నుంచి కూడా హైదరాబాద్ లాంటి చోట్ల నిరసన వ్యక్తమవుతుంది.
జిల్లాల వరకే...
దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అదనపు ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంత వరకూ ఓకే. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే ఒక జిల్లాలో ఉండే వారు ఆ జిల్లా వరకూ మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలుంటుంది. అంతే తప్పించి తిరుపతి నుంచి విశాఖకు వెళ్లాలంటే మహిళలయినా ఛార్జీలు చెల్లించాల్సిందేనన్న ప్రతిపాదనను తేనున్నట్లు సమాచారం. దీనివల్ల ఆర్టీసీకి నష్టం తగ్గడమే కాకుండా సీట్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తవని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. జిల్లాల్లోనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమలు చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Tags:    

Similar News