చంద్రగిరి మండలం అభివృద్ధికి స్వర్ణగిరి చంద్రగిరి ప్రణాళిక

స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు

Update: 2026-01-16 03:57 GMT

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. గత ఏడాది సంక్రాంతికి కందులవారి పల్లి, చిన్న రామాపురం, ఎ రంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లికి కార్యక్రమానికి ఎంపిక చేశారు. స్వర్ణ నారావారి పల్లె ప్రాజెక్టు ద్వారా ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఏడాది కాలంలోనే అన్ని ఇళ్లకూ వంద శాతం సౌర ప్యానెళ్లను అమర్చడం ద్వారా ఇంధన స్వయం సమృద్ధిని సాధించింది. తద్వారా ప్రతీ ఇంటికీ ఉచితంగానే విద్యుత్ వెలుగులు వచ్చాయి.

అనేక విధానాలతో...
శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తరణ తదితర ప్రణాళికల ద్వారా తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగింది. మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా ప్రత్యేక స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కార్యక్రమాలను కూడా సమర్ధంగా అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి సంతృప్త స్థాయిలో ప్రతీ లబ్దిదారుడికి చేరేలా అమలు చేయటంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పనను స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమంలో భాగంగా అమలు చేశారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో చంద్రగిరి మండలం అంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలని..ఏడాదిలోపు నిర్థేసించుకున్న ఫలితాలను సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఈ మేరకు సిఎం చంద్రబాబు దిశానిర్థేశం చేశారు.


Tags:    

Similar News