Andhra Pradesh : గుడ్ న్యూస్.. రేషన్ దుకాణాల్లోనే ఇక అన్నీ... ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ దుకాణాల్లో చిరు ధాన్యాలు అందించాలని నిర్ణయించింది

Update: 2025-04-09 05:37 GMT

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం, పంచదార మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పప్పు దినుసులు కూడా సబ్సిడీ రేట్లపై పంపిణీ చేయనున్నారు. అయితే ఒక్కొక్క కార్డుకు ఎంత మేరకు పంపిణీచేయాలి? కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి పంపిణీ చేస్తారా? లేక తెలుపు రంగు రేషన్ కార్డుదారులందరికీ ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తారా? అన్నది త్వరలోనే నిర్ణయించనున్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు...
నిత్యావరవ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానంగా పేదలు పప్పులు, నూనెలు ఇతర చిరు ధాన్యాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు మరింత పెరిగిపోయాయని కొంత అసంతృప్తి ప్రజల్లో కనపడుతుంది. దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ వాటి ధరల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోవడంతో సబ్సిడీ పద్ధతిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి అందచేస్తే కొంత వరకూ ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
బయట మార్కెట్ లో...
రేషన్ దుకాణాల్లోనే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పుతో పాటు వీటిని కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయించింది. బయట మార్కెట్ తో పోలిస్తే ధర తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ ప్రక్రియను చంద్రబాబు సర్కార్ ఎంచుకుంది. దీనివల్ల పేదలపై ఆర్థిక భారం తగ్గి చాలా వరకూ ఆదా అవుతుందని భావిస్తుంది. కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తుండటంతో వాటికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుపు రంగు రేషన్ కార్డు దారులందరికీ సబ్సిడీ పద్ధతిలో చిరు ధాన్యాలు సరఫరా చేయడానికి అన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వరలోనే ఈ పథకం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించే అవకాశముంది.


Tags:    

Similar News