Chabndrababu : చంద్రబాబు స్ట్రాటజీ మార్చారా? కండువాలు అలా కప్పేయడానికి కారణమదేనా?

శాసనమండలి సభ్యుల విషయంలో టీడీపీ ఇక ఎక్కువ కాలం వెయిట్ చేసే అవకాశం కనిపించడం లేదు

Update: 2025-09-21 08:59 GMT

శాసనమండలి సభ్యుల విషయంలో టీడీపీ ఇక ఎక్కువ కాలం వెయిట్ చేసే అవకాశం కనిపించడం లేదు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది మందికి పైగానే వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. అయితే శాసనమండలి ఛైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించలేదు. దీంతో శాసనమండలిలో కూటమి కంటే వైసీపీ బలం ఎక్కువగా ఉండటంతో వాయిస్ రెయిజ్ చేస్తుంది. శాసనమండలిని స్థంభింప చేస్తుంది. శాసనసభకు గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, శాసనమండలి విషయానికి వచ్చే సరికి సభకు హాజరై అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజీనామాలు ఆమోదం పొందితే తిరిగి ఎన్నికయ్యేది కూటమి పార్టీలకు చెందిన వారే.

పదిహేను నెలలయినా...
దాదాపు పదిహేను నెలల పాటు శాసనమండలి ఛైర్మన్ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదిస్తారని కూటమి పార్టీలు భావించాయి. కానీ ఛైర్మన్ నిర్ణయం కావడంతో రాజీనామాలపై ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికి మండలిలో వైసీపీకి సభ్యుల బలం ఎక్కువగా ఉంది. బిల్లుల విషయంలో ఇప్పటి వరకూ ఇబ్బందులు కలగకపోయినా.. వాదనలు, విమర్శల విషయంలో వారిదే పై చేయి అవుతుంది. మండలి సమావేశాలు వాయిదా పడుతున్నాయి. దీంతో కూటమి పార్టీలు ఇక లాభం లేదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. అందుకే పార్టీ మారిన ఎమ్మెల్సీలను అధికారికంగా తమ పార్టీలో చేర్చుకుని మండలిలో కొంత బలం పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టింది.
ఇప్పటికే ఐదుగురు...
పోతుల సునీత, జకియా ఖానమ్ లు బీజేలో చేరారు. తాజాగా మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి టీడీపీలో అధికారికంగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు నేటి నుంచి సభలో టీడీపీ సభ్యులుగానే తమ గళం విప్పనున్నారు. అప్పుడు ఇరుకున పడేది వైసీపీ మాత్రమే. ఇదే వ్యూహాన్ని మిగిలిన రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల విషయంలోనూ అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు కూటమి పార్టీల కండువాలు అధికారికంగా కప్పుకోవడంతో మిగిలిన వారు కూడా త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీలలో అఫిషియల్ గా చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మండలి ఛైర్మన్ రాజీనామాలు ఆమోదించకపోవడంతో చంద్రబాబు వ్యూహం మార్చి ఇలా తన బలం పెంచుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.





Tags:    

Similar News