TDP : చంద్రబాబు సైకిల్ ను నడపలేకపోతున్నారా? మెతక వైఖరితో నష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు

Update: 2026-01-18 07:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ ఆయన శ్రమను ప్రజలు గుర్తిస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు మాత్రం గుర్తించడం లేదు.ఎక్కువ మంది శాసనసభ్యులు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు నిజంగా దోపిడీకి దిగుతున్నారన్న విమర్శలు సొంత పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. గతంలో ప్రధాన మీడియా ద్వారా వచ్చే విమర్శలు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి.

మందలించారంటూ...
ఇటీవల మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి అందిన నివేదిక మేరకు దాదాపు 48 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయితే వారిని చంద్రబాబు హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ ఎమ్మెల్యే పనితీరు మాత్రం గాడిన పడలేదన్నది వాస్తవం. ఎందుకంటే ప్రతి పనికీ పర్సంటేజీలు. ప్రతి కార్యక్రమంలో అవినీతి. సొంత పార్టీ నేతలను కూడా వారు వదలకుండా దోపిడీకి తెరతీస్తున్నారన్న విమర్శలున్నాయి. చంద్రబాబు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల, లోకేశ్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఎమ్మెల్యేలు కొందరు నిర్భీతిగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం పార్టీలోనే జరుగుతుంది.
అనేక మంది ఎమ్మెల్యేలపై...
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య తలెత్తిన వివాదంలోనూ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయినా సరే ఆయనను పిలిచి మందలించిన సందర్భం లేదు. అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్ ప్రసాద్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అక్కడి కార్యకర్తలే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. అయినా పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుతో పార్టీ బాగా డ్యామేజీ అయింది. ఇక రానున్న కాలంలో ఇలాంటి మెతక వైఖరిని అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి నష్టం తప్పదన్న సంకేతాలు ఆ పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి.



Tags:    

Similar News