విభజన తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ పనిచేశారు. చంద్రబాబు రెండు దఫాలు, జగన్ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇద్దరి స్టయిల్ ఆఫ్ గవర్నెన్స్ వేర్వేరుగా ఉంటుంది. విపత్తుల సమయంలో ఇద్దరిదీ వేర్వేరు రకాలుగా స్పందిస్తారు. ఇద్దరూ విపత్తు నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రయత్నించేవారే. కానీ చంద్రబాబు మాత్రం నిరంతరాయంగా విపత్తు సమయంలో పనిచేస్తారు. జగన్ మాత్రం తాను చెప్పాలనుకున్నది చెప్పేసి క్లుప్తంగా ముగించేసి అధికారులకు పూర్తి బాధ్యతలను అప్పగిస్తారు. చంద్రబాబు మాత్రం అధికారుల వెంట పడి మరీ పనులు చేయిస్తారు. ఇలా ఇద్దరూ వేర్వేరు రకాలుగా విపత్తు సమయంలో ఉత్తర్వులు ఇచ్చినా ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేం. అదే సమయంలో నష్టాన్ని నివారించడానికి మాత్రమే కొంత మేరకు ఉపయోపగపడతాయి.
విపత్తు వచ్చినప్పుడు...
మొంథా తుఫాన్ విషయంలో నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి కారణంగానే అధికారులు ఒళ్లు వంచి పనిచేశారన్నది వాస్తవం. విపత్తుల సన్నద్ధత, ప్రణాళిక, నష్ట నివారణ వంటి విషయాల్లో చంద్రబాబు అనుభవం నిన్న పనిచేసింది. ఆర్టిజీఎస్ లో కూర్చుని ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం, టెక్నాలజీని ప్రజలతో కనెక్ట్ చేయడం 2018లోనే చంద్రబాబు మొదలెట్టారు. ఆర్టీజీఎస్ మీద అతిగా ఆధారపడుతున్నారని, బాబు నమ్మకాన్ని ఆర్టీజీఎస్ బాధ్యులు ఆయన్ని ఊహల్లో ఉంచడానికి ఉపయోగించుకున్నారు అనే విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి. కానీ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలకు ముందే మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో పాటు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి సహాయ చర్యలు పర్యవేక్షించడం, ముందుగానే జిల్లాలకు నిధులను విడుదల చేయడంతో తుపాను సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. అదే సమయంలో ఆయనపై విజయవాడ బుడమేరు విషయంలో మాత్రం ఒకింత విమర్శలను ఎదుర్కొన్నారు.
కరోనా సమయంలో...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయానికి వస్తే కరోనా సమయంలో ఆయన ప్రదర్శించిన తీరును ఎవరూ కాదనలేరు. దేశం కాదు.. ప్రపంచమంతా కరోనా బారిన పడి మృత్యుఘోష వినిపిస్తుంటే జగన్ మాత్రం నిశ్శబ్దంగానే సరైన సమయంలో సరైన నిర్ణయాలు క్యాంప్ కార్యాలయంలోనే కూర్చుని బయటకు కన్పించకుండా ఆదేశాలు జారీ చేసి మరణాల సంఖ్యను తగ్గించగలిగారు. అధికారులతో అదే పనిగా సమీక్షలు చేయరు. అలాగే విపత్తుల సమయంలో పర్యటనలకు కూడా జగన్ దూరంగా ఉంటారు. తాను వెళితే ముఖ్యమంత్రి కంట్లో పడటానికే అధికారులు ప్రయత్నిస్తారని, బాధితులకు న్యాయం జరగదని భావించి ఆయన కూర్చున్న చోట నుంచి కదలకుండా నడిపించేస్తారు. పెద్దగా ప్రచారాన్ని కూడా జగన్ కోరుకోరు.
ప్రచారం లేకుంటే...
చంద్రబాబు ప్రచారాన్ని ఇప్పటి నుంచే కాదు ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఎక్కువగా కోరుకుంటారు. అందులో ఏ మాత్రం తప్పులేదు. రాజకీయ నాయకుడికి కావాల్సిందదే. ఎందుకంటే ప్రజాసేవ చేయడంతో పాటు దానిని ప్రజల వద్దకు చేర్చడం కూడా రాజకీయ నేతలకు అంతే ముఖ్యం. అందుకే చంద్రబాబు నాయుడు ప్రచారం విషయంలో ఏ మాత్రం తగ్గరు. జగన్ మాత్రం పెద్దగా ప్రచారాన్ని ఆశించరు. తాము చేసిన పని ప్రజల్లోకి వెళుతుందని నమ్ముతారు. కానీ చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే కేవలం ప్రజాసేవ ఒక్కటి మాత్రమే సరిపోదని, చేసిన పనిని పదే పదే ప్రజలకు చెప్పుకోవడం ద్వారా సాధ్యమయిందని జగన్ గుర్తించాలని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద ఇద్దరి నేతలు ఆలోచన ఒకటే అయినా ఆచరణ మాత్రం వేరుగా ఉండటంతో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు. జగన్ క్లిక్ కాలేకపోతున్నారన్నది వాస్తవం.