Chandrababu : ఈసారి కొంచెం కష్టపడితే క్లీన్ స్వీప్ చేయడం ఖాయం : మహానాడులో చంద్రబాబు
వచ్చే ఎన్నికలలో ఇంకొంచెం కష్టపడితే కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
వచ్చే ఎన్నికలలో ఇంకొంచెం కష్టపడితే కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప లో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో పది శాసనసభ స్థానాలకు ఏడు స్థానాల్లో గెలిచామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 శాతం స్ట్రయిక్ రేటు సాధించామని అన్నారు. దేశంలో అనేక పార్టీలు ఉన్నప్పటికీ టీడీపీది తెలుగు రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానమని చంద్రబాబు అన్నారు. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి విషయంలో టీడీపీ ట్రెండ్ సెట్టర్ అని చంద్రబాబు అన్నారు. కార్యకర్తల త్యాగాలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న అదే జోరు కొనసాగించడానికి కార్యకర్తల బలమే కారణమని తెలిపారు.
దేవుని గడపలో...
రాయలసీమలో ఎప్పుడూ తిరుపతిలో జరుపుకునే వారమని, తొలిసారి మహానాడును దేవుడి గడప అయిన కడపలో జరుపుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను వేధించినా వెనక్కు తగ్గలేదన్నారు. పార్టీ ప్రతినిధులతో చర్చించేది టీడీపీ ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే టీడీపీ తొలి నినాదం అని చంద్రబాబు తెలిపారు. ఎందరో టీడీపీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేసి అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. తాను ఒక సైనికుడినని, నిరంతరం పోరాటం చేస్తానని, తన శక్తి, ఆయుధాలు కార్యకర్తలేనని చంద్రబాబు కార్యకర్తలను ప్రశంసించారు. సిద్ధమా అని కార్యకర్తలను ప్రశ్నించారు. ఎన్నో యుద్ధాలు చేసిన టీడీపీ నీతి నిజాయితీగా రాజీకీయాలు చేస్తామని చంద్రబాబు తెలిపారు.