ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించడానికి తనకు శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కార్యాలయంలో ఉండేది తక్కువ. బయట తిరిగేది ఎక్కువ. అదే ఆయన ప్రత్యేకత. తన హయాంలో ఏదో జరగాలన్న తాపత్రయం చంద్రబాబులో అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన నిరంతరం దేశ, విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. తరచూ ఢిల్లీకి వెళుతూ రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, ప్రయోజనాలపై ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థిక పరిస్థితులను వివరించి ఆంధ్రప్రదేశ్ కు మేలు చేకూర్చేలా ఏదో ఒక ప్రాజెక్టును తెస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా రాష్ట్రానికి తెస్తూ కొంత ఆర్థిక వెసులు బాటు కలిగేలా చేస్తున్నారు.
విశాఖలో జరగనున్న...
ఇక వచ్చే నెలలో విశాఖలో జరగనున్న సీఐఐ పారిశ్రామిక సదస్సులో పెట్టుబడుల వరదను పారించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. తనకున్న నలభై ఐదేళ్ల రాకీయ అనుభవాన్ని ఏపీకి ఎంతో కొంత లాభం చేకూర్చేందుకు ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి గూగుల్ తో ఒప్పందం కూడా ఆ కోవలోనిదే. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నెలకొల్పుతున్నారు. ఇలా అన్ని రకాలుగా ఒంటి చేత్తో రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఏడు పదుల వయసు దాటినా ఆయన యవకుల కంటే ఎక్కువగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని వేరే చెప్పాల్సిన పనిలేదు.
వచ్చే నెలలో లండన్ కు...
వచ్చే నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనకు వెళుతున్నారు. లండన్ లో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన సాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ విధానాలను, అందుబాటులో ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. వచ్చే నెల విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ పారిశ్రామిక సదస్సు ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, సదస్సుకు ముందే కీలకమైన పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీకి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.