Chandrababu : కేబినెట్ భేటీలో చంద్రబాబు మంత్రులతో మార్చుకోవాలంటూ?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-06-04 12:17 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు మాట్లాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల మధ్య సమన్వయం కొరవడితే నవ్వుల పాలవుతామని, ఒకే అంశంపై మాట్లాడేటప్పుడు అందరూ ఒకే విధంగా మాట్లాడితే ప్రజల్లోకి సరైన పద్ధతిలో వెళుతుందని చంద్రబాబు అన్నారు. అంతే తప్ప ఎవరికి వారు ఒకే అంశంపై వేర్వేరు విధంగా మాట్లాడితే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత పెంచుకునే అవకాశముందని చెప్పారు. అందుకే మాట్లాడే ముందు మంత్రులు సబ్జెక్ట్ పై అవగాహనకు వచ్చి మాట్లాడాలని, సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా మంత్రులందరూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

కొందరు మంత్రుల పనితీరును...
అయితే మంత్రులు ఇంకా పనితీరును మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని, కేవలం శాఖపరమైన విషయాలు మాత్రమే కాకుండా పార్టీ సంబంధిత విషయాలను గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నది ఎప్పటికప్పుడు తెలసుకుని తమకు కేటాయించిన జిల్లాల్లో పరిస్థితులను తమకు తెలియజేయాలని కోరారు. అలాగే కార్యకర్తలకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కూడా చంద్రబాబుఅన్నారు. ఈ ఏడాదిలో అనేక మంది కొత్తగా మంత్రి పదవులు చేపట్టారని, వచ్చేఏడాదికి పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. చాలా మంది మంత్రుల పనితీరు బాగుందని, అయితే కొందరు మాత్రం కొంత తమ వ్యవహారశైలితో పాటు పనితీరులో కూడా మార్పులు చేసుకోవాలని ఆయన అన్నారు.
ప్రజలతో మమేకం కావాలని...
ప్రత్యర్థి పార్టీ నేతల అరెస్ట్ ల గురించి ఆలోచించవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చంద్రబాబు తెలిపారు అది జగన్ అయినా మరొకరయినా ఒకటే న్యాయం ఉంటుందని అన్నారు. నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, సోషల్ మీడియాలో పాటు పత్రికల్లో వచ్చే వార్తలకు కూడా మంత్రులు స్పందించాలని, లేకపోతే అందులో వచ్చే వార్తలు నిజమని ప్రజలు భావించే అవకాశముంటుందని, ఆ ఛాన్స్ ఎవరూ తీసుకోవద్దని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు ముందుండాలని కూడా చంద్రబాబు మంత్రులను ఆదేశించారు.


Tags:    

Similar News