Chadrababu : నేతలు చంద్రబాబు చేయి దాటి పోయారా? గాడిన పెట్టేవారు లేరా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలను చేపట్టారు.

Update: 2025-09-27 07:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలను చేపట్టారు. అయితే గత మూడు దఫాలుగా ఇలాంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొనలేదు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు చేయి దాటి పోయే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. కూటమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తాను వస్తుంటే వాటిని చెడగొట్టేందుకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ లైన్ తో పాటు నాయకత్వంపై కొంచెం కూడా భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. 1999 లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా దగ్గర నుంచి చూసిన వారికి ఇది అర్థమవుతుంది. నాడు మంత్రులు మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలన్నా నాటి సీపీఆర్వో విజయ్ కుమార్ ను అడిగి పర్మిషన్ తీసుకోవాలి. అంటే చంద్రబాబు అనుమతితోనే మీడియా సమావేశాలు, అందులో మాట్లాడాల్సిన అంశాలను ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువగా టీడీపీలో కనిపిస్తుంది.

సీనియర్ నేతలు కూడా...
కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎవరికి వారే యుమునా తీరే. ఒకరు ఇద్దరు కాదు.. అనేక మంది ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కూటమిలోని మిత్రపక్షాల మధ్య వైరం నెలకొనేలా సొంత పార్టీ ఎమ్మెల్యేలే చేస్తున్నారు. కావాలనే చేస్తున్నారా? లేక అవగాహన లోపంతో చేస్తున్నారా? అంటే వాళ్లేమీ కొత్త వారు కాదు. సీనియర్ నేతలు. అన్నీ విషయాలు తెలుసు. వారిలో పార్టీ నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని ఇలా తీర్చుకుంటున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిపక్షం లేకపోయినంత మాత్రాన అంత స్వేచ్ఛగా వ్యవహరించాలా? అని చంద్రబాబు మండిపడుతున్నట్లు తెలిసింది. సీనియర్ నేతలే ఇలా వ్యవహరిస్తున్నారంటే పార్టీ క్రమశిక్షణ పట్టుతప్పుతున్నట్లే కనిపిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో త్వరలోనే దీనిపై చంద్రబాబు సీరియస్ గానే నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది.
చంద్రబాబు సీరియస్...
పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వైఖరి ని కూడా చంద్రబాబు తప్పుపట్టారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిని తన్నాలన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని చంద్రబాబు సీరియస్‌ అయ్యారని తెలిసింది. అలాగే ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోషల్‌ మీడియా పోస్టుల విషయంలో హోంశాఖ తీరు సరిగా లేదంటూ తప్పు పట్టారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం... సీనియర్లు కూడా ఇలా మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించినట్లు తెలిసింది. కైకలూరు, హిందూపురం ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, నందమూరి బాలకృష్ణ సంవాదంపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది జరిగి ఉండాల్సిన పరిణామం కాదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సభలో పీసీబీ చైర్మన్‌ మీద ఆరోపణలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేరునూ చంద్రబాబు ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News