Chandrababu : కూటమి ఏమో కాని.. కుంపట్లు మామూలుగా లేవుగా? మహానాడుకు ముందే?
చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చారు కానీ, టీడీపీ నేతల్లో మాత్రం చాలా చోట్ల అసంతృప్తులు తలెత్తుతున్నాయి. తెలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమిని ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చారు కానీ, టీడీపీ నేతల్లో మాత్రం చాలా చోట్ల అసంతృప్తులు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి యాభై వసంతాల చరిత్ర ఉండటంతో ఎందరో నేతలు ఉన్నారు. వారంతా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తమకు పదవులు గ్యారంటీ అన్న నమ్మకంతో ఉన్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కమలం పార్టీకి తక్కువ స్థాయిలో పదవులు ఇచ్చేవారు. ఎక్కువ పదవులు తెలుగుదేశం పార్టీ నేతలకు ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం మూడు పార్టీలు కలసిపోటీ చేయడంతో జనసేన, బీజేపీలకు కూడా పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో టీడీపీ నేతలను పక్కన పెట్టాల్సి వస్తుంది.
మిత్రులకు న్యాయం చేయాలని...
చంద్రబాబు నాయుడుకు పార్టీ నేతలకు పదవులు ఇద్దామని మనసులో ఉన్నప్పటికీ మిత్రులకు కూడా న్యాయం చేయాలని భావించి వారికి విధిలేని పరిస్థితుల్లో కేటాయించాల్సి వస్తుంది. ఇక ఈ సమస్య ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా టీడీపీనేతలు అసంతృప్తిగా ఉన్నట్లు వారి మాటలను బట్టి తెలుస్తుంది. మినీ మహానాడుల్లోనే ఈ విషయం బయటపడుతుంది. నేతలు తమకు పదవులు దక్కడం లేదన్న నిరాశలో ఉన్నారు. తాము కలసి పనిచేస్తేనే మొన్నటి ఎన్నికల్లో జనసేన గెలిచిందని, అయితే అన్ని పదవులు జనసేనకు కేటాయించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో...
నామినేటెడ్ పోస్టుల కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన నేతలు వరసగా జనసేన నేతలకు పదవులు దక్కుతుండటంతో సభల్లోనే ఓపెన్ అయిపోతున్నారు. తాము పార్టీ కోసం పడిన కష్టానికి ప్రతిఫలం ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ టీడీపీ ఇన్ ఛార్జిని నియమించకపోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. జనసేన ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ కోసం పనిచేయడానికి ఒక ఇన్ ఛార్జి కావాల్సి ఉంటుంది కదా? అని అంటున్నారు. అందుకే తూర్పు గోదావరి జిల్లా అంటే కేవలం జనసేన మాత్రమే కాదని, టీడీపీ తొలి నుంచి బలంగా ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
బండారు వ్యాఖ్యలతో...
ఇక విశాఖ జిల్లాలోనూ సీనియర్ నేత బండారు సత్యనారాణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి నిధులను తమకు ఎక్కువగా విడుదల చేయలేదని ఆయన అన్నారు. తన నియోజకవర్గంపై ఎందుకంత వివక్ష అంటూ అంటూ ఆయన ప్రశ్నించడమే కాకుండా తన నియోజకవర్గానికి కేవలం మూడు కోట్లు మాత్రమే కేటాయించారని, మిగిలిన నియోజకవర్గాలకు ఏడు కోట్ల రూపాయలు కేటాయించారని, ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేకపోతున్నందుకు ప్రజలకు తానే క్షమాపణ చెబుతానని ఆయన అన్నారు. ఇలా రాయలసీమ, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లలో ఈ రకమైన అసంతృప్తి ఉంది. మరి వీటిని ఎలా పారదోలతారన్నది చూడాల్సి ఉంది.