Andhra Pradesh Cabinet : మంత్రి పదవి ఊడేది.. వీళ్లేనటగా... బాబు హింట్ ఇచ్చినా అర్థం కాలేదా?

చంద్రబాబు నాయుడు ఈసారి వార్నింగ్ బెల్స్ ఇవ్వలేదు. కాస్త గట్టిగానే హెచ్చరించారు. అంటే మంత్రి పదవులకు తుదిఘడియలు సమీపించినట్లేనని అనుకోవాలి.

Update: 2025-07-10 06:58 GMT

చంద్రబాబు నాయుడు ఈసారి వార్నింగ్ బెల్స్ ఇవ్వలేదు. కాస్త గట్టిగానే హెచ్చరించారు. అంటే మంత్రి పదవులకు తుదిఘడియలు సమీపించినట్లేనని అనుకోవాలి. గత ఏడాది కాలం నుంచి ఓపిక పట్టిన చంద్రబాబు నాయుడు ఏదో ఒక కారణం చూపి కొందరు మంత్రులను తొలగించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే సీనియర్లు, జూనియర్లతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు జనసేన, ఒక్కరు బీజేపీ మంత్రులను తీసి పక్కన పెడితే మిగిలిన టీడీపీ మంత్రుల్లో చాలా మందిని సామాజికవర్గంతో పాటు యువత అని భావించి తీసుకున్నారు. యువత అయితే తనతో పాటు సమానంగా వేగంగా పరుగులు పెడతారని భావించారు.

తగిన సమయం ఇచ్చినా...
కానీ చంద్రబాబు అనుకున్నది జరగలేదు. యువ మంత్రులు దేనికీ పనికి రారని చంద్రబాబుకు ఎప్పుడో అర్థమయింది. కానీ వారికి కొంత సమయం ఇవ్వాలని, పనితీరును మెరుగు పర్చుకోవడానికి అవకాశమివ్వాలని నిర్ణయించారు. ఎవరూ పుట్టుకతోనే మంత్రులు కాలేరని, కొత్త కాబట్టి ఆ మాత్రం ఇబ్బందులుంటాయని భావించిన చంద్రబాబు నాయుడు మెల్ల మెల్లగా రాజకీయాల్లో మెళుకువలను నేర్చుకుంటారని భావించారు. అంతే కాదు శాఖలపై పట్టు పెంచుకుని అధికారులను పరుగులు పెట్టిస్తారని అంచనా వేశారు. కానీ సీనియర్ నేతలను, పార్టీలో తొలి నుంచి ఉన్న వారిని కూడా పక్కన పెట్టి మరీ సామాజికవర్గం కోణంలో తొలి ఛాన్స్ ఇచ్చినా ఫలితం లేదని గ్రహించారు. గతంలో మంత్రుల పనితీరుపై మార్కులను కూడా ఇచ్చారు.
ఎప్పటికప్పుడు మారుతూ..
గతంలో మాదిరిగా రెండున్నరేళ్లు ఆగే సమయం లేదు. ఇప్పుడు రాజకీయాలు కూడా స్టాక్ మార్కెట్ మాదిరిగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అందులోనూ విపక్షాలు చేసే విమర్శలను తిప్పి కొట్టడంలోనూ, ప్రభుత్వంపై ప్రత్యర్థులు చేస్తున్న ప్రకటనలకు కూడా సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇందులో కొందరు సీనియర్ నేతలు కూడా ముభావంగా ఉండటంతో ప్రభుత్వం ప్రజల్లో పలుచనగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజల్లోకి విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారమే బలంగా వెళుతుండటం, ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాకపోవడంతో ఇది భవిష్యత్ లో మరింత దెబ్బతినే అవకాశాలున్నాయని భావించి చంద్రబాబు హెచ్చరించినట్లు చెబుతున్నారు.
దాదాపు పది మంత్రుల వరకూ...
చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో హెచ్చరించిన తర్వాత వరసగా మీడియా సమావేశాలు పెట్టి వైసీపీపై విమర్శలు చేయడాన్ని చూస్తుంటే చాలా మంది మంత్రులకు తమనే అన్నట్లు అర్థమయి ఉంటుందని భావించాలన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిలో దాదాపు పది మంది మంత్రులుండగా అందులో సీనియర్లతో పాటు జూనియర్లుగా కూడా ఉన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తూర్పు గోదావరి, కోస్తా జిల్లాల్లోని దాదాపు పది మంది వరకూ త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరిపి వేటు వేయాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇచ్చిన గడువు కూడా పూర్తి కావడంతో రెండున్నరేళ్లు కాదు... ముందుగానే పనికి చేయని మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన కొత్త వారు వస్తున్నారంటూ హింట్ ఇచ్చారంటున్నారు.


Tags:    

Similar News