వివేకా ఇంట్లో వైఫై రూటర్.. ఎంతో కీలకమట

సీబీఐ మరోసారి వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వైసీపీ ఎంపీ

Update: 2023-07-21 07:30 GMT

సీబీఐ మరోసారి వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కుట్ర చేశారని సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను కూడా ప్రస్తావించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని తెలిపింది. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని వివరాలు ఇవ్వాలని అధికారులను కోరామని తెలిపింది. వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాలని చెప్పింది. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ రిపోర్టులు త్రివేండ్రం సీడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది.

నిందితులు సునీల్ యాద‌వ్‌, ఉద‌య్‌కుమార్‌రెడ్డి క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లోనూ, ఇంటి ప‌రిస‌రాల్లోనూ ఉన్నార‌ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్న‌ట్టు తెలిపింది సీబీఐ. ప్రాధమిక చార్జిషీట్ లో పేర్కొన్న అంశాలు తుది చార్జిషీట్ లో మార్పులు చేశామని సీబీఐ తెలిపింది. వివేకానంద‌రెడ్డి ఇంట్లో 2019, మార్చి 14న రాత్రి సునీల్ యాద‌వ్‌ వున్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంట‌ల‌కు వివేకా నివాసం స‌మీపంలో, 2.42 గంట‌ల‌కు నివాసం లోప‌ల ఉన్నాడని.. సునీల్ సెల్ నెంబ‌ర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామని సీబీఐ గ‌తంలో పేర్కొంది. తాజాగా తుది నివేదిక‌లో ఇది నిజం కాద‌ని సీబీఐ కోర్టుకు స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో స్ప‌ష్టం చేసింది. వివేకా ఇంట్లో 2019, మార్చి 14 అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత సునీల్ యాద‌వ్ లేడని.. 2019, మార్చి 15న ఉద‌యం 8.05 గంట‌ల‌కు వివేకా ఇంటి బ‌య‌ట‌, 8.12 గంట‌ల‌కు ఇంటిలోప‌ల వున్నాడని తెలిపింది. గ‌తంలో UTC గ్రీన్‌విచ్ కాల‌మానం ప్ర‌కారం గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాల‌మానం ప్ర‌కారమే చూడాలని, గ‌తంలో స‌మాచార సేక‌ర‌ణ‌లో పొరపాటు జరిగిందని తాజా చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. వివేకానంద‌రెడ్డి క‌డ‌ప ఎంపీ సీటును ఆశించ‌లేద‌ని వైఎస్ ష‌ర్మిల వాంగ్మూలం ఇచ్చిన‌ట్టు సీబీఐ తెలిపింది.


Tags:    

Similar News