Ys Jagan : ఇదేంది మామా.. జగన్ కు నాయుళ్లే దిక్కయ్యారా?
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అయితే మరీ ఘోరం ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారని, మూడు దశాబ్దాల తర్వాత వైఎస్ కుటుంబం కంచుకోట అయిన పులివెందులలో పసుపు జెండా రెపరెపలాడిందని తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక వైనాట్ 175 అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.
రిగ్గింగ్ చేసుకున్నారంటూ...
మరొక వైపు తమ ఏజెంట్లను బయటకు లాగేసి, ఏకపక్షంగా టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకున్నారని, అందుకు కొన్ని ఫొటోలను వైసీపీ అధినేత జగన్ రెండు చోట్ల పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులను పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశంలో చెప్పారు. న్యాయస్థానానికి వెళ్లినా పనికాలేదు. అయితే ప్రజల్లోకి మాత్రం జగన్ తప్ప మరే రెడ్డి సామాజికవర్గం నేత కూడా తీసుకెళ్లలేకపోయారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వంటి వారు చెప్పినా వారు ఆ ప్రాంతానికి చెందిన వారు కావడంతో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ రెడ్డి సామాజికవర్గంలో రోజా మినహా మరే రాజకీయ నాయకుడు ఈ విషయంపై స్పందించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. రాజకీయ విశ్లేషణలు సయితం చేసే వారు స్పందించినా సీమ నేతల్లో స్పందన లేదు.
ఈ ముగ్గురే...
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై గట్టిగా, ధీటుగా స్పందించిన వారు ముగ్గురే కనపడుతున్నారు. వారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన మీడియా సమావేశం పెట్టి తనదైన స్టయిల్ లో అధికార పార్టీపై విరుచుకపడగలిగారు. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలేదని చెప్పారు. తర్వాత మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు సయితం స్పందించారు. ట్వీట్ ద్వారానే కాకుండా మీడియా సమావేశంలోనూ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఇక ఇంకొక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తన దైన రీతిలో స్పందించారు.ఈ ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. అంతే తప్ప రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లా రెడ్డి సామాజికవర్గం నేతలు స్పందించకపోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.