Andhra Pradesh : బీజేపీ ఎమ్మెల్యేను పనిచేసుకోకుండా అడ్డుపడుతున్నదెవరు? చుక్కలు చూపిస్తున్నారుగా
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, క్యాడర్ కలసి కట్టుగా పనిచేయడం వల్లనే 164 స్థానాలను గెలుచుకుంది
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిజంగా 2024 ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, క్యాడర్ కలసి కట్టుగా పనిచేయడం వల్లనే 164 స్థానాలను గెలుచుకుంది. జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రైట్ సాధించగా, టీడీపీ, బీజేపీలు మాత్రం 94 శాతం స్ట్రయిక్ రేట్ ను సాధించాయి. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ ఇన్ని సీట్లు రాలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు వచ్చిన సీట్లు మాత్రమేనని, తర్వాత ఈ స్థాయిలో వచ్చింది 2024లో మాత్రమేనని, చంద్రబాబు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నారు. ఈ విజయం వెనక మూడు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల శ్రమ, కష్టం ఉందన్నది అందరూ ఒప్పుకుంటున్నదే.
జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను...
కానీ గెలిచిన తర్వాత పొత్తులో భాగంగా తాము కోల్పోయిన స్థానాల్లో టీడీపీ నేతలు అక్కడ బీజేపీయో, జనసేన ఎమ్మెల్యే గెలిచినా వారిని సక్రమంగా పనిచేసుకోనివ్వకుండా మోకాలడ్డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇదే రకమైన ఫిర్యాదు చేశారు. నారా లోకేశ్ కూడా జిల్లా పర్యటనల్లో కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడుతూ కూటమిలో ఉన్న మిత్ర పక్షాల ఎమ్మెల్యేలకు టీడీపీ నేతలు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం కనిపించడంలేదు. దీంతో అసహనంతో ఉన్న జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతుండటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
శాసనసభలోనే..
తాజాగా ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఏకంగా అసెంబ్లీలోనే టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన సభ ముందుంచారు. దీంతో సభ్యులు అవాక్కయ్యారు. గత ఎన్నికల్లో ఎచ్చర్ల నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపి, ఆ సీటును బీజేపీకి కేటాయించారు. అక్కడ పోటీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావుకు టీడీపీ నేతలు చుక్కలు చూపుతున్నారట. సోషల్ మీడియాలో బీజేపీ ఎమ్మెల్యేపై ప్రచారం చేస్తున్నది కూడా టీడీపీ నేతలేనట. తనను టార్గెట్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేను కట్టడి చేయాలంటూ ఆయన శాసనసభ సాక్షిగా చెప్పుకున్నారంటే ఏ స్థాయిలో టార్చర్ ఉందో చెప్పకనే తెలుస్తుంది. ఇప్పటికైనా మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉంది. లేకుంటే మూడు పార్టీల మధ్య సమన్వయం మాత్రం భవిష్యత్ లో ఉండదన్నది వాస్తవం.