Andhra Pradesh : చంద్రబాబు ఎదుట వైఎస్ షర్మిల డిమాండ్ ఇదే

రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

Update: 2025-11-21 06:00 GMT

రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ముఖ్యంగా అరటి రైతులది అరణ్య రోదనగా మారిందన్నారు. సిరులు కురిపించే పంట నేడు రైతన్న కంట కన్నీరు తెప్పిస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. అన్నదాతను అరటి పంట ముంచుతుంటే, రైతన్నల ఆక్రందన కూటమి ప్రభుత్వానికి పట్టక పోవడం సిగ్గుచేటని విమర్శించారు. టన్నుకు 28 వేల నుంచి వెయ్యికి పడిపోతే, రైతులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుంటే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

రైతన్న దగాకు...
ఉద్యానవన శాఖ పని చేస్తుందా.. మొద్దు నిద్ర పోతుందా ? అని వైఎస్ షర్మిల నిలదీశారు. ఆరుగాలం కష్టించి పండించిన అరటి గెలలను పశువులకు మేతగా పడేస్తుంటే ఇక రాష్ట్రంలో ఎక్కడుంది రైతు సంక్షేమం ? లక్షల్లో పెట్టుబడికి వేలల్లో ఆదాయమైతే రైతు సుభిక్షంగా ఎలా ఉంటాడు ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అరటికి కిలో ధర రూపాయికి పెట్టే కూటమి ప్రభుత్వం రైతన్నకు చేసింది దగానేనని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అరటి రైతుల బాధలను విని ధరల పతనంపై సమీక్ష జరపాలని కోరారు.


Tags:    

Similar News