Andhra Pradesh : కూటమి సర్కార్ ఆ ధైర్యం చేస్తుందా? వదిలేస్తుందా?
వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశముందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది
వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశముందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. పదకొండు మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత అసెంబ్లీకి రాకుండా కాలం గడిపేస్తున్నారు. శాసనసమండలికి హాజరవుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ శాసనసభకు వచ్చే సరికి ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. ఇందుకు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వస్తామని తొలినుంచి ప్రకటిస్తున్నారు. అయితే పదకొండు స్థానాలు రావడంతో ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారంటూ అధికార పక్షం ప్రశ్నిస్తుంది. దీంతో బడ్జెట్ సమావేశాల తొలి రోజు హాజరవ్వడం, తర్వాత డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది.
వైసీపీ ఎమ్మెల్యేలు...
కొందరు ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఇటీవల ఎథిక్స్ కమిటీ కూడా ఆరోపించింది. సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకాలు చేసి వేతనాలు కొందరు ఎమ్మెల్యేలు తీసుకోవడంపై ఎథిక్స్ కమిటీ అభ్యంతరం చెప్పింది. దాదాపు ఆరుగురు వరకూ ఇలాంటి ఎమ్మెల్యేలున్నారని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం వేతనం తీసుకోవడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కానీ వరసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేయవచ్చని శాసనసభ నిబంధనలు చెబుతున్నాయి. ఆ నిబంధనలను ఉపయోగించుకుని అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై వేటు వేస్తారంటున్నారు.
అరవై పనిదినాలు...
ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత కనీసం అరవై పనిదినాలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. లేకుంటే వారిపై అనర్హత వేటు వేసే అవకాశముంది. ఇటీవల శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. అయితే అనర్హత వేటు అనేది రాజకీయంగా తీసుకోవాల్సిన అంశం. ఒక్కసారి అన్ని ఉప ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా? అన్నది చూడాలి. అలాగే అదే సమయంలో ఒక్కసారి అంతమందిపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళితే సానుభూతి వెల్లువెత్తే అవకాశముంటుంది. అందుకే హెచ్చరించి వదిలేస్తారా? లేక ధైర్యం చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.