ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. మరోసారి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు.అమరావతిలో కీలకమైన టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు పనులు అప్పగింతకు సీఆర్డీఏ అధారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో జీఏడీ టవర్ తో పాటు టవర్లు 1,2,3,4 నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. టెండర్లలో ఎల్ వన్ గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. .జీఏడీ టవర్ పనులను 882 కోట్లకు ఎన్ సీసీ సంస్ధ, హెచ్ఓడీ టవర్లు 1,2 టెండర్లను 1487 కోట్లకు షాపూర్జీ సంస్థ,టవర్లు 3, 4 పనులను ఎల్ అంట్ టీ సంస్థ 1303 కోట్లతో దక్కించుకున్నాయి. మొత్తం 3673.44 కోట్లతో ఈ టవర్ల నిర్మాణ పనులను త్వరలో ఆయా కంపెనీలు ప్రారంభించనున్నాయి. పరిపాలన అంతా ఒకేచోట జరిగే విధంగా ఈ ఐదు టవర్ల నిర్మాణ పనులను చేపట్టనున్నారు.
రెండో దశ ల్యాండ్ పూలింగ్...
హైదరాబాదులో నిర్మించిన శంషాబాద్ ఎయిర్ పోర్టు తరహాలో అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిపోర్టును, 2,500 ఎకరాల్లో స్మార్టు ఇండస్ట్రీస్ కొరకు మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీని నిర్మించేందుకు దాదాపు పది వేల ఎకరాల భూమి కావాల్సి ఉంది.. ఇందుకు కావాలసిన భూమిని రైతుల నుండి భూసేకరణ చేయాలా లేదా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలా అనే దానిపై గ్రామసభలు నిర్వహిస్తూ రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నామన్నాని మంత్రి నారాయణ తెలిపారు. ఈ గ్రామ సభలో రైతులు ల్యాండ్ పూలింగ్ కే మొగ్గుచూపుతున్నారని, ఇప్పటికే దాదాపు 24 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వానికి 10 వేల ఎకరాలు అవసరం కానుండగా రైతుల నుండి దాదాపు 40 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించనున్నారు.
ధరలు పెంచలేదు...
ఇప్పటికే అమల్లో ఉన్న ల్యాండ్ పూలింగ్ చట్టంలోని నియమ నిబంధనల మేరకు 217 చదరపు కిలోమీటర్ల మేరకే అనుమతి ఉందని, ఈ పరిధిని మరింత పెంచేందుకు అథారిటీ సమావేశంలో ఆమోదం పొందారు. అలాగే ఎడ్యుకేషన్ మరియు హెల్త్ ఇన్స్టిట్యూట్ల రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు పై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని, రెండో దశ ల్యాండ్ పూలింగ్ ను కూడా పూర్తిచేసి అభివృద్ది పర్చడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణంలో టెండర్ల ధరలు పెంచారని అనవసర ఆరోపణలు చేస్తున్నారని, .22 మంది చీఫ్ ఇంజనీర్ల కమిటీ నిర్ణయం మేరకే ధరలు ఖరారు చేశామని స్పష్టం చేశారు.