Ys Jagan : జగన్ దేనిని ఎంచుకుంటారో? పదవా? పంతమా?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది

Update: 2025-09-05 08:54 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. ఆయన అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవికే ఎసరు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు అంటే గవర్నర్ ప్రసంగం ఉండే సమయంలో మాత్రమే జగన్ తో పాటు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. పదకొండు మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో గెలవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం చెబుతుంది. అదే సమయంలో శాసనసభలో ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి తమకు ఆ హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం...
రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభలో పది శాతం మంది సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంటే కనీసం పందొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ నుంచి గెలవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటిమి పార్టీ లు చెబుతుంది. అయితే తమకు ప్రతిపక్ష హోదా దక్కితేనే ప్రజాసమస్యలపై చర్చించడానికి అవసరమైన సమయం దక్కుతుందని వైసీపీ వాదిస్తుంది. తమ గొంతు వినిపించని సభలో తాము ఎందుకు రావాలంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ తో పాటు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాల్సి ఉంది. లేకపోతే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశముంది.
అరవై రోజులు వరసగా...
ఒక సభ్యుడు వరసగా అరవై సమావేశ దినాలు గైర్హాజరయితే ఆ సభ్యుడు తన ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశముంది. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ అధికారం రాజ్యాంగంలో శాసనసభకు ఉంది. అయితే జగన్ మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే పులివెందులకు ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా? లేక ఉప ఎన్నికల్లో తేల్చుకుందామని జగన్ గైర్హాజరవుతారా? అన్నది చూడాల్సి ఉంది. జగన్ పంతానికి పోతే పదవికే ప్రమాదం సంభవిస్తుంది. రాజీ పడితే సభలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శాసనసభకు హాజరైతే మాత్రం సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశముంది.


Tags:    

Similar News