ఏబీవీ సస్పెన్షన్ కాలంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
పదవీ విరమణ చేసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది
పదవీ విరమణ చేసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7వ వరకు ఏబీవీ సస్పెన్షన్ కు గురయ్యారు.
రెండు విడతలుగా...
రెండో విడతలో 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30వ తేదీ వరకు మరోమారు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంతమొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ఏబీవీపై నమోదైన అభియోగాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.