Andhra Pradesh : లోకల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలోనే ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలోనే ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. విద్యుత్తు ఛార్జీలను తగ్గించేందుకు సిద్ధమయింది. బహుశ చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రకటన వెలువడే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. విద్యుత్తు ఛార్జీల భారం మోపనని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో బాగంగా విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే అమలు ఎప్పటి నుంచి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. విద్యుత్తు ఛార్జీలు పెరగడంతో పాటు ట్రూ అప్ ఛార్జీల మోతతో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంపై అహసనం వ్యక్తం చేస్తున్నారు.
ట్రూ అప్ ఛార్జీలను...
ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని గుర్తించిన ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను తగ్గించేందుకు సిద్ధమయింది. విద్యుత్తు ఛార్జీల ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడుతుంది. అందుకే విద్యుత్తు ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టినా ప్రయోజనం లేదని గ్రహించిన ప్రభుత్వం ఛార్జీలను తగ్గించేందుకు సిద్ధమయింది. ఇప్పటికే యూనిట్ కు పదమూడు పైసలు ట్రూడౌన్ చేసి విద్యుత్తు ఛార్జీలు కొంత వరకూ తగ్గించింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతో దాదాపు 32,166 కోట్ల మేర విద్యుత్తు ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. అయితే కారణం తమ ప్రభుత్వం కారణం కాదని, వైసీపీ ప్రభుత్వమని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అందుతున్న నివేదికలను బట్టి తెలుస్తోంది.
ప్రభుత్వమే భరించాలని...
అయితే ఇక ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను తామే భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ఇకపై ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపవద్దని, ఆ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని ఆదేశించారని, దీంతో ఇక ఏపీ ప్రజలపై ట్రూ అప్ విద్యుత్తు ఛార్జీల భారం పడదు. దీంతో విద్యుత్తు ఛార్జీలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. దీనివల్ల ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగడమే కాకుండా కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్తు ఛార్జీల తగ్గింపుతో చాలా వరకూ ప్రజల్లో నెలకొన్న అసంతృప్త స్థాయులను తగ్గించవచ్చన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.