Pensions : పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక ఎక్కడినుంచైనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను దారులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ పింఛను ను వేరే ప్రాంతానికి బదిలీ చేసుకోవడానికి అవసరమైన విధానాన్ని రూపొందించింది. ప్రజలు వివిధ కారణాల వల్ల తాము పింఛను తీసుకుంటున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లినప్పటికీ అక్కడకు తమ పింఛను బదిలీ చేసుకునే వీలు కల్పించింది. అన్ని అర్హతలుండి, ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇక తాము ఉండే చోటు నుంచి పింఛను తీసుకునే అవకాశాన్ని ఏపీ సర్కార్ కల్పించింది.
బదిలీ చేసుకునేందుకు...
ఏపీలో పింఛను బదిలీ ఆప్షన్ ఓపెన్ అయింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలోని ఒక సచివాలయం నుండి మరొక సచివాలయానికి, ఒకే జిల్లాలోని ఒక మండలం నుండి మరో మండలానికి, రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పింఛనును బదిలీ చేసుకోవడానికి ఆప్షన్ ప్రారంభమయింది. ఎవరైనా పింఛనుదారులు పెన్షన్ ను వేరే ప్రాంతానికి బదిల చేసుకోవాలని భావిస్తే సులువుగా చేసుకునే వీలును ఏపీ ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం ఈ వెసులుబాటు ను నేటి నుంచి కల్పించింది.
ఇలా చేయాలి...
తమ పింఛనును ఎక్కడికి బదిలీ చేసుకోవాలనుకున్నారో ఆ సచివాలయం పేరు, సచివాలయం కోడ్ , సచివాలయం మండలం, జిల్లాను ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. పింఛను బదిలీ కోసం దరఖాస్తు మొబైల్ యాప్ లో పెడతారు. గత కొన్నేళ్లుగా పింఛను దారులు తమ పింఛను బదిలీ కోసం ప్రయత్నిస్తున్నా అది జరగడం లేదు. వివరాల కోసం సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.