Andhra Pradesh : చంద్రబాబు కీలక నిర్ణయం... ఉల్లి రైతుల ఇంట ఆనందమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఉల్లి రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లభించనుంది. ఉల్లి ప్రస్తుతం క్వింటాల్ కు పన్నెండు వందల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో అన్నదాతలు ఖుషీ ఫీలవుతున్నారు.
దారుణంగా పడి పోవడంతో...
ఇటీవల ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి పాయలు దిగుమతి అవుతుండటంతో పాటు దిగుబడి కూడా భారీగా పెరగడం వల్లనే ధరలు దారుణంగా పడిపోయాయి. కర్నూలు జిల్లా ఉల్లి మార్కెట్ లో క్వింటాల్ ధర ఎనిమిది వందల రూపాయలు కూడా పలకడం లేదు. దీంతో ఉల్లి రైతులు తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు రావడం లేదని వాపోతున్నారు. . మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నా, రైతులు నష్టపోకుండా తీసుకొన్న ఈ నిర్ణయం వారికి ఒక భరోసాగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం తక్షణ కొనుగోళ్లతో ఆగిపోకుండా, రైతులు పండించిన ఉల్లిని కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు.
పంటను నిల్వ చేసుకునేందుకు...
అలాగే బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరిగేంత వరకు పంటను నిల్వ చేసుకుని, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చన్న సౌలభ్యం రైతులకు లభించేఅవకాశం కల్పించనుంది. రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు అమ్ముకునే వేదికలైన రైతు బజార్లను మరింత ఆధునీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతు బజార్ల సంఖ్యను 150 నుంచి 200 వరకు పెంచడం, మార్కెట్ యార్డుల్లో కోల్డ్ చైన్ మరియు వేర్‌హౌసింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ చర్యలు ఉల్లి రైతులకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని అన్ని పంటల రైతులకు భారీ ఊరట దక్కుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఉల్లి ధరలకు గిట్టుబాటు ధర లభిస్తుండటం, నిల్వ సౌకర్యం కల్పించడంతో సానుకూల పరిణామమేనని చెప్పాలి.