Andhra Pradesh : పురుషులకూ పొదుపు సంఘాలు - అలవాటు చేస్తే మంచిదేగా? నిబంధనలివే

పురుషులకు కూడా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2025-02-04 07:33 GMT

ఇప్పటి వరకూ మహిళలకు మాత్రమే పొదుపు సంఘాలున్నాయి. వాటికి ప్రభుత్వం నిధులు అందచేస్తుంది. అయితే ఇకపై పురుషులకు కూడా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను కూడా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మహిళలేకాదు.. పురుషులు కూడా పొదుపు పాటిస్తే కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకూ మహిళలు పొదుపు సంఘాల పేరిట తాము పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ తో తమ కుటుంబ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా, కొందరు మహిళలు స్వయం ఉపాధిని కూడా పొందుతున్నారు.

కుటుంబ అవసరాలను...
ఇప్పుడు పురుషులకు కూడా అదే రీతిలో పొదుపును అలవాటు చేస్తే కుటుంబానికి వెసులుబాటు లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. నెలకు కొంత మొత్తాన్ని జమ చేసుకుంటూ వారిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ పొదుపు సంఘాలు ఉపయోగపడతాయి. కుటుంబ అవసరాలు, విద్య, వైద్యం ఖర్చులకు కూడా మరొకరిని చేయిచాచాల్సిన అవసరం ఉండదు. అయితే మహిళల్లో పొదుపు చేయడమే కాకుండా తక్కువ వడ్డీతో రుణాలను తమ సంఘం నుంచి పొందే వెసులుబాటు పురుషులకు కూడా కల్పిస్తే మరింత వెసులుబాటు లభిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే మహిళల మాదిరిగానే పురుషుల్లోనూ పొదుపు అలవాటును పెంచేందుకు ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందంటున్నారు.
నిబంధనలు ఇవే...
మగాళ్ల పొదుపు సంఘాలకు ప్రభుత్వం మ్యాచింగ్ గ్యాంట్ కింద నిధులను ఇవ్వనుంది. కొందరు పురుషులు కలిసి పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. మెప్మా కార్యాలయం సిబ్బందిని కలిస్తే గ్రూపును ఏర్పాటు చేస్తారు. ప్రతి నెల ప్రతి పురుషుడూ వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకూ తమ సంఘంలో పొదుపు చేసుకోవచ్చు. ఆరు నెలల తర్వాత రివాల్సింగ్ ఫండ్ కింద ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయాలు ఇస్తుంది. ఈ మొత్తాన్ని పెంచుకుంటూ ప్రభుత్వం పోతుంటుంది. పద్దెనిమిదేళ్ల నుంచి అరవై ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఐదుగురు కలిసి ఒక సంఘంగా ఏర్పడే అవకాశముంది. అయితే పురుషులు ఈ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పని సరి అని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది.


Tags:    

Similar News