Andhra Pradesh Pensions : పింఛన్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం.. అసలు కారణమిదేనట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లలో కోత పెట్టింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లలో అవకతవకలను గుర్తించిన కూటమి ప్రభుత్వం దానిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లలో కోత పెట్టింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లలో అవకతవకలను గుర్తించిన కూటమి ప్రభుత్వం దానిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా గతకొన్నాళ్లుగా కసరత్తులు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తుంది అయితే పూర్తిగా వైకల్యం కలిగి మంచానికే పరిమితమయిన వారికి మాత్రం నెలకు పదిహేను వేల రూపాయల పింఛను ను మంజూరు చేస్తుంది. అయితే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్లలో పెద్దయెత్తున అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వెంటనే విచారణ ప్రారంభించింది.
విచారణలో గుర్తించిన...
విచారణలో అనేక మందికి కొంత శాతం వైకల్యం ఉన్నప్పటికీ నెలకు పదిహేను వేల రూపాయలు పించను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి వారికి నెలకు ఆరు వేల రూపాయలు మాత్రమే పొందాల్సిన వారు పదిహేను వేల రూపాయలు పొందుతున్నట్లు వెరిఫికేషన్ ప్రక్రియలో గుర్తించారు. వీటిని గుర్తించిన అధికారులు వారిని పింఛను మంజూరీ నుంచి తొలగించారు. వారికి నెలకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. అలాంటి వారి శాతం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఖజనాకు, ప్రజా ధనానికి తూట్లు పొడిచే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ కూటమి ప్రభుత్వం పునస్సమీక్షించింది.
రీ వెరిఫికేషన్ లో...
ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పింఛన్ లో భాగంగా జనవరి 2025 నుంచి దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ చేయడం జరుగుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు డాక్టర్ల ఆమోదం పొందిన అన్ని కేటగిరీల వికలాంగుల శాతంలకు సంబంధించి పెన్షన్ వెబ్ సైట్ కు అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. పదిహేను వేల రూపాయలు పింఛన్ పొందుతున్న వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేశారు. ఎవరికైతే 85% పైబడి వైకల్యం ఉండి మంచానికే పరిమితమైనట్టు డాక్టర్లబృందం రిపోర్ట్ చేసినారో వారికి పదిహేను వేల రూపాయలు యధావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వస్తుందని అధికారులు తెలిపారు. వెరిఫికేషన్ లో వైకల్యం శాతం 85 శాతం కంటే తక్కువ ఉండి 40 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే వారికి 15000 రూపాయల పింఛను నుంచి 6000 రూపాయలకు మార్పు చేశారు.
ముప్ఫయి రోజుల్లో మాత్రమే..
40శాతం కంటే వైకల్యం తక్కువగా ఉంటే వయసు 60 సంవత్సరాలు పైబడినచో వారికి 15000 రూపాయలకు బదులు వృద్ధాప్య పెన్షన్ గా నెలకు 4000 రూపాయలు మంజూరు చేస్తారు. 40 శఆతం కంటే వైకల్యం తక్కువ ఉండి 60 సంవత్సరాలు లేని వారికి సెప్టెంబర్ నెల నుండి పింఛన్ నిలుపుదల చేయనున్నట్లు అధికారుల ప్రకటించారు. అలాగే దివ్యాంగుల పింఛన్ లో కూడా 40 శాతం పైబడి ఉన్నట్లయితే వారికి యధావిధిగా వికలాంగుల పింఛన్ ఆరువేల రూపాయలు వస్తుందని తెలిపారు. ఈ విషయంలో అభ్యంతరాలుంటే సచివాలయంలో తమ అభ్యంతరాలను నమోదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈనెల 25వ తేదీ లోపుగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా దీనిపై అప్పీల్ కి వెళ్లాలనుకుంటే అప్పీల్ ను నోటీసు అందించిన 30 రోజుల లోపు మాత్రమే చేయాలి.