Ys Sharmila : షర్మిలకు సొంత పార్టీలో సెగ.. కానీ హైకమాండ్ పట్టించుకోకపోవడానికి రీజన్ ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు సొంత పార్టీ నేతల నుంచి సెగ పుడుతుంది.

Update: 2025-06-12 07:30 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు సొంత పార్టీ నేతల నుంచి సెగ పుడుతుంది. వైఎస్ షర్మిల వ్యవహారశైలి నేతలకు ఎవరికీ నచ్చడం లేదు. ప్రాంతీయ పార్టీ తరహాలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోనూ అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలనుకోవడమే ఆమెకు సొంత పార్టీలో శత్రువుల సంఖ్య పెంచేలా చేస్తుంది. వైఎస్ షర్మిల కేవలం ఒక అజెండాతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టంగా అర్థమవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. కేవలం జగన్ తో పాటు ఆ పార్టీ నేతలపై నిత్యం విమర్శలు చేస్తూ కాలంగడిపేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం వదిలేసి అధికారంలోని లేని పార్టీపై విమర్శలు చేయడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మరింత ఓటు బ్యాంకు కోల్పోయే ప్రమాదముందని ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి.

అధికార పార్టీని ఏమనకుండా...
వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు విమ్శలు చేస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ అధికారంలో లేనప్పుడు కూడా విమర్శలు చేయడం, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నట్లు కాదా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమితో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారన్నవిషయాన్ని వైఎస్ షర్మిల గమనిస్తున్నారా? అని నిలదీస్తున్నారు. జగన్ ను ఇప్పుడు తిట్టిపోసినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుందని, బీజేపీతో కలసి నడుస్తున్న టీడీపీపై విమర్శలు చేయాల్సిన పరిస్థితుల్లో కేవలం జగన్ ను ఆ పార్టీ నేతలను టార్గెట్ చేయడం వైఎస్ షర్మిల అజెండా ఏంటో స్పష్టంగా తెలుస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు.
అంతంత మాత్రంగా ఉన్న...
ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ షర్మిల వ్యవహారశైలితో మరింత దిగజారిపోయే అవకాశముందన్న హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎందరో పీసీసీ చీఫ్ లు ఉన్నప్పటికీ ఇలా వ్యవహరించలేదని, వైఎస్ బిడ్డగా జనంలోకి వచ్చిన షర్మిల రాజకీయం చేయడం మానేసి కుటుంబ సభ్యులపై కసి తీర్చుకోవడానికి పదవిని అడ్డంపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు హస్తం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఏమీ లేని చోట ఏం చర్యలు తీసుకుంటామన్న ధోరణిలో ఉన్నారు. ఇటీవల షర్మిలపై సుంకర పద్మశ్రీ సమరాన్ని చేపట్టారు. షర్మిలకు కుటుంబ తగాదాలే తప్ప పార్టీ పట్టలేదని జిల్లాలు తిరిగి ఆరోపిస్తున్నారు.
షర్మిలకు వ్యతిరేకంగా...
ఏఐసీసీ మెంబర్ గా ఉన్న సుంకర పద్మశ్రీ జిల్లాల్లో పర్యటిస్తూ వైఎస్ షర్మిల కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నుంచి సంతకాలను కూడా సేకరిస్తున్నారు. కూటమి అందించిన స్క్రిప్టు ను చదువుతూ షర్మిల విమర్శలు చేస్తున్నారని, అధికార పార్టీని ప్రశ్నిచకుండా ప్రతి పక్ష పార్టీని ప్రశ్నించడమేంటని సుంకర పద్మశ్రీ నిలదీస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల మాత్రం వీటిని కూడా లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. తాను అనుకున్నట్లుగానే పార్టీని నడపాలన్న ఉద్దేశ్యం ఆమెలో కనిపిస్తున్నట్లుంది. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా పెద్దగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టకపోవడం, ఏపీకి ఎవరినీ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిని నియమించకపోవడం బట్టి చూస్తుంటే షర్మిల విషయంలో చర్యలు ఉండకపోవచ్చంటున్నారు. కానీ అదే జరిగితే పార్టీకి మరింతనష్టం చేకూరుతుందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News