నేను గాలిలో కలసిపోతానంటావా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Update: 2021-11-26 08:18 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ వరద నష్టంపై మాట్లాడారు. తాను గాలలోనే వచ్చి గాలిలోనే కనుమరుగవుతానని, తనను వ్యతిరేకించిన వైఎస్ కూడా కాలగర్భంలో కలసిపోయాడన్న చంద్రబాబు కామెంట్స్ పై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సంస్కారానికి నా నమస్కారం అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సమాధానం ఇచ్చారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం నిమిషం పని అని, కానీ అక్కడ తాను వెళితే సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందనే వెళ్లలేదని జగన్ చెప్పారు. సీఎం చుట్టూ అధికారులు, మీడియా హడావిడి తప్ప పనులు జరగవని అన్నారు. అనుభవ పూర్వకంగా ఈ విషయాన్ని అధికారులు తనకు చెప్పారని జగన్ అన్నారు. అందుకే వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించానని చెప్పారు.

నేను వెళ్లడం ముఖ్యమా?
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడైనా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం చూశారా? అని జగన్ ప్రశ్నించారు. ఒడిశాకు మనకంటే ఎక్కువ తుపానులు, వరదలు వస్తుంటాయన్నారు. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకే తాను ఇక్కడి నుంచి సమీక్ష నిర్వహించానని చెప్పారు. ఏ సంఘటన జరిగినా ఆస్తి, ప్రాణ నష్టం తమ ప్రభుత్వం ఎప్పుడూ దాచి పెట్టలేదన్నారు. సహాయకార్యక్రమాలు పూర్తయిన తర్వాత తాను స్వయంగా వెళ్లి బాధితులను అడిగి తెలుసుకుంటానన్నారు. ఎవరైనా సాయం అందలేదని చెబితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని జగన్ చెప్పారు. అందరికీ సాయం అందేలా చూడటమే తమ ప్రభుత్వలక్ష్యమని అన్నారు. ఏరోజూ చంద్రబాబు వరదల సమయంలో మానవత్వం చూపలేదన్నారు.


Tags:    

Similar News