Amaravathi : ట్రై సిటీస్.. ఇక మూడు నగరాలూ వెలిగిపోనున్నాయిగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు

Update: 2025-04-16 04:06 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు. హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం జరిగినట్లుగానే అమరావతి నిర్మాణంలోనూ ఆయన చాలా విజన్ తో నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్క చేయదలచుకోలేదు. తన పేరు ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరంగా ఉన్నట్లుగానే, ఆంధ్రప్రదేశ్ లోనూ కలకాలం నిలిచిపోవాలని ఆయన ఆకాంక్షగా కనిపిస్తుంది. అందుకే ఎన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చినా, ఎవరు ఏమి అనుకున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ ను మించిన నగరాన్ని అమరావతిలో నిర్మించి ఆంధ్రప్రదేశ్ కు సంపద సృష్టించే నగరంగా మార్చాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

నిధులు వెచ్చించడానికి...
ఇందుకోసం ఆయన పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు. రాజధాని నిర్మాణంపై పెట్టే ప్రతి పైసా తిరిగి కోట్ల రూపాయల్లో తిరిగి ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఒక్కసారి తాను అనుకున్న ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణం పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా రాజధాని అమరావతి ప్రపంచంలోనే అతి పెద్ద నగరంగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 33 వేల ఎకరాలను సేకరించిన చంద్రబాబు నాయుడు మరో నలభై వేల ఎకరాలను సేకరించి అందులో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడంతో పాటు స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేయాలని గట్టిగా నిర్ణయించారు.
వచ్చే నెల 2వ తేదీన ప్రధాని...
వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అప్పటి నుంచి ఇక పనులు వేగం పుంజుకోనున్నాయి. మొదట సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణం చేపడితే అమరావతి ఒక రూపు వస్తుంది. దీంతో పాటు వివిధ విద్యాసంస్థలు కూడా అమరావతి ప్రాంతానికి రానున్నాయి. దీంతో రాజధాని అమరావతిలో ప్రజలు నివాసానికి తగిన ఏర్పాట్లు చేసుకునే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరగనుంది. పెద్ద వెంచర్లు రానున్నాయి. భూములిచ్చిన రైతులు కూడా తమకు అలాట్ చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతే రాజధాని అమరావతికి పూర్తి రూపం వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
మూడు నగరాలు కలిస్తే...
ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి కలిపి ఇక మెగాసిటీగా రూపకల్పన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. నిజానికి ఈ విజయవాడ, గుంటూరు పట్టణాలు ఇప్పటికే కలిశాయి. దీనికి అమరావతి కూడా తోడయితే మూడు నగరాలు కలిసి మరింత పెద్ద నగరంగా అభివృద్ధి చెందే అవకాశముంది. అదే సమయంలో మూడు నగరాలు కలిస్తే దాదాపు చిలకలూరిపేట వరకూ ఆంధ్రప్రదేశ్ రాజధాని విస్తరించే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే హైదరాబాద్ కు మించిన నగరాన్ని అత్యంత వేగంగా నిర్మించి చరిత్రకు ఎక్కవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News