Chandrababu : చంద్రబాబు ప్లానింగ్ ఫెయిలయిందా? తమ్ముళ్లు మాట వినడం లేదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఏడాదిలో ఎమ్మెల్యే పై ప్రజాభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఒక టీం ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని నియోజకవర్గాల వారీగా నివేదికలను చంద్రబాబుకు అందించనుంది. అయితే ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేలు పక్క దారి పడుతున్నట్లు ప్రాధమికంగా సమాచారం అందుతుండటంతో ఇటీవల టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా చంద్రబాబు వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కావాలనుకుంటే ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని, పక్కచూపులు చూడవద్దని కూడా సూటిగానే చెప్పారంటున్నారు.
సీమ జిల్లాల్లో...
అయితే ప్రస్తుతం అందిన నివేదికల మేరకు రాయలసీమలోని నాలుగు పాత జిల్లాల్లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 90 శాతం మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గుర్తించినట్లు తెలింది. నియోజకవర్గాల్లో అనుచరుల దందాలు ఎక్కువ కావడంతో పాటు పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీలకు దిగడంతో పాటు కొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలు చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారన్న విషయం కూడా ఈ ఐవీఆర్ఎస్ పోల్ ద్వారా వెల్లడయినట్లు తెలిసింది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోని దాదాపు 90 శాతం నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసి చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు దిగారు.
అనంతలో తప్పించి...
కర్నూలు జిల్లా అయితే మరీ దారుణంగా ఉందని అంటున్నారు. నగరం, రూరల్ అనేది తేడా లేకుండా ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నేతలకు మధ్య విభేదాలు తీవ్రమయినట్లు ఈ సర్వే లో వెల్లడయిందని చెబుతున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో తాము మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశామని, ఈసారి ఇదే అభ్యర్థి అయితే ఓటు వేయబోమని కూడా చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కడప జిల్లాలోని ఏడు నియోజవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలను ఈసారి మార్చాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేల పనితీరుపై కాస్త అటుఇటుగా ఉందని తెలిసింది. ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను మినహాయించి మిగిలిన ఎమ్మెల్యేలకు మంచి మార్కులు పడ్డాయంటున్నారు.
అన్ని రకాల వ్యాపారాల్లో...
నెల్లూరు జిల్లాలో అయితే దాదాపు ఆరు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఎమ్మెల్యేలు పనులు చేయకపోగా, నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడం కూడా వ్యతిరేకతకు ఒక కారణంగా చెబుతున్నారు. ఇసుక, మద్యం, బార్లు ఇలా అన్ని వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు, వారి అనుచరుల దందాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ చేతులు పెడుతుండటంతో ఎమ్మెల్యేలపై ఏడాదికి జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చే పింఛను సమయంలోనూ పెద్దగా రెస్పాన్స్ రాకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. రహదారులను అభివృద్ధి చేసినా, పరిశ్రమలను నెలకొల్పుతున్నా ఎమ్మెల్యేలపై ప్రజల్లో కనపడుతున్న వ్యతిరేకత చంద్రబాబును ఆలోచనలో పడేసినట్లు కనిపిస్తుందంటున్నారు. అందుకే త్వరలో సమావేశం పెట్టి ఎమ్మెల్యేలను నేరుగా దుమ్ము దులిపేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలిసింది.