Chandrababu : చంద్రబాబు లెక్క కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే.. ఈసారి కూడా విజయమేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ అదే నినాదదం అందుకున్నట్లు కనపడుతుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ అదే నినాదదం అందుకున్నట్లు కనపడుతుంది. 2014లో చేసినట్లే ఆయన మరోసారి రిపీట్ చేస్తున్నట్లు కనపడుతుంది. అమరావతి, పోలవరం నామస్మరణతోనే ఆయన ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. 2014లోనూ అదే స్ట్రాటజీతో ఆయన ముందుకు వెళ్లారు. ఈ రెండు పూర్తి కావాలంటే మరోసారి తనకు అధికారాన్ని ప్రజలు అప్పగిస్తారని భావించారు. కానీ 2019 లో మాత్రం చంద్రబాబు నాయుడు వ్యూహం దెబ్బతినింది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు లేరన్నది అర్థమయింది. మళ్లీ 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆ రెండు నినాదాలనే అందుకున్నారు.
బనకచర్ల ప్రాజెక్టుతో రైతులను...
అయితే ఈసారి అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు తోడు కొత్తగా బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకు వచ్చారంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే పూర్తి కాలేదు. అలాంటిది ఎనభై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా గేమ్ ఛేంజర్ అంటూ చెప్పడం చూస్తుంటే రైతులను ఆకట్టుకోవడానికే ఈ ప్రయత్నమన్న విమర్శలు వైసీపీ నేతలు చేస్తున్నారు. గతంలో ఎలాగయితే అమరావతి, పోలవరం పనులు పూర్తి చేయకుండానే దిగిపోయారో... ఈసారి కూడా మళ్లీ ఇవి పూర్తికావంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్ లో విమర్శలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం గేమ్ ఛేంజర్ తో మరోసారి అధికారంలోకి వస్తామని గట్టిగా నమ్ముతున్నారు.
జగన్ పాలన చూసిన తర్వాత...
మహానాడు కడపలో విజయవంతం కావడంతో మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం తనదేనని చంద్రబాబు భావిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ పాలనను ప్రజలు చూడలేదని, అందుకే ఆ స్థాయిలో గెలిపించారని, కానీ జగన్ ఐదేళ్ల పాలన చూసిన తర్వాత ఏ వర్గమూ మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోదని చంద్రబాబు గట్టిగా నమ్మకంగా ఉన్నారు. అందుకే చంద్రబాబులో అంత విశ్వాసం కనిపిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరొకవైపు కూటమితోనే ఈసారి కూడా పోటీ చేస్తాం కాబట్టి ఓట్ల చీలిక అంటూ జరగదని, మరొకసారి అధికారంలోకి రావడం ఖాయమన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఉన్నారు. టీడీపీ సీనియర్ నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన హామీలను...
ఇక రానున్న కాలంలో ఇచ్చిన హామీలను ఎటూ అమలు చేస్తాం కాబట్టి ప్రజల్లో తొలి ఏడాది ఏదైనా అసంతృప్తి ఉన్నప్పటికీ అదితొలిగి పోతుందని, అంటున్నారు. జూన్ నెలలలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం అమలు చేస్తారు. ఆగస్టు పదిహేనో తేదీన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నారు. ఇక పథకాల అమలు క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని చెప్పడంతో చంద్రబాబు కొంత దూకుడుగానే వెళుతున్నట్లు కనిపిస్తుంది. మరొక వైపు నాలుగేళ్ల ముందుగానే పింఛను మొత్తాన్ని పెంచే ఆలోచన ఉందని చెప్పి వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు వంటి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అరవై ఐదు లక్షల మంది ఉండటంతో ఆ ఓటు బ్యాంకును సుస్థిరపర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి చంద్రబాబు ఆలోచనలు వర్క్ అవుట్ అవుతాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.