Chandrababu : చంద్రబాబు చెప్పొచ్చేదేంటంటే... వరసగా తననే గెలిపించాలట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు. వరసగా గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పదే పదే చెబుతుండటం వెనక రాజకీయకోణం కూడా లేకపోలేదు. అలాగే తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి గల కారణాలను కూడా రోజుకొకసారి మీడియా సమావేశం పెట్టి ఏకరవు పెడుతున్నారు. అదీ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే అభివృద్ధి మొత్తం మందగించిదన్నది ఆయన ఆరోపణ. గత ప్రభుత్వం అభివృద్ధిపై పెట్టకుండా కేవలం సంక్షేమం కోసమే అప్పులు తెచ్చి మరీ నిధులు ఖర్చు చేయడం వల్ల రాష్ట్రం అధోగతి పాలయిందని, ఐదేళ్లు గ్యాప్ రాకుండా ఉండి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదని చంద్రబాబు అంటున్నారు. చూస్తుంటే చంద్రబాబు ఇప్పటి నుంచే మైండ్ గేమ్ మొదలుపెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వరస గెలుపులతోనే...
చంద్రబాబు చెబుతున్న మాటలను చూస్తుంటే ఆయన పారదర్శకంగానే ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. వాస్తవాలను చెప్పి ప్రజలకు ముందు వెళ్లి వారిని చైతన్యవంతుల్నిచేయాలని ఆయన భావిస్తున్నారు. వరసగా ఏ ప్రభుత్వాన్ని అయినా గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, అందుకే అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని చెప్పుకు వస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే బాధపడేది ప్రజలేనని ఆయన భయపెడుతున్నారు. అభివృద్ధి పనుల వల్లనే ఆదాయం పెరుగుతుందంటున్న చంద్రబాబు అందుకు అధికారం వరసగా కావాలంటున్నారు. వరస అధికారంతోనే విజన్ సాధ్యమవుతుంద్నారు. మధ్యలో బ్రేకులు పడితే అందుకు ప్రజలే చింతించాల్సి వస్తుందని ఆయన చెబుతుండటం చూస్తుంటే 2047 వరకూ తమకే అధికారం ఇవ్వాలని చంద్రబాబు ప్రజలను కోరుతున్నారు.
ఉదాహరణలు చూపుతూ...
ఇందుకు చంద్రబాబు నాయుడు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. దేశంలో వరసగా మోదీ సర్కార్ అధికారంలోకి రావడం వల్లనే దేశం ఇంతటి అభివృద్ధి సాధ్యమయిందని తెలిపారు. గుజరాత్ లోనూ వరసగా ఐదు సార్లు బీజేపీని గెలిపించడం వల్లనే అక్కడ పారిశ్రామిక పురోగతితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంటున్నారు. తాను దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచన చేస్తానని, తాత్కాలిక ప్రయోజనాలను అందించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయబోనని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పేదరికం నుంచి బయటపడాలంటే వరసగా తమనే గెలిపించాలని ఆయన ఎన్నికలకు నాలుగేళ్ల ముందు నుంచే నినాదం అందుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే చంద్రబాబు ఆలోచనను ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారన్నది మాత్రం భవిష్యత్ లో తెలియాల్సి ఉంది.
ఈ ప్రశ్నలకు మాత్రం...
అయితే అదే సమయంలో ఒడిశాలో ఐదు సార్లు గెలిచినా అక్కడ అభివృద్ధి ఏం జరిగింది? పశ్చిమ బెంగాల్ లో వరసగా మూడు సార్లు మమత బెనర్జీని గెలిపించినా అక్కడ అభిృద్ధి మాటేంటి? అన్న ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు మాత్రం చక్కటి సమాధానం చెబుతున్నారు. గత ముప్పయి ఏళ్ల రాష్ట్ర చరిత్రలను తీసుకుని ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చూసుకోవాలని ఆయన కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం కారణంగానే తాము సంక్షేమ పథకాలను వెనువెంటనే అమలు చేయలేకపోతున్నామని, అయితే ఇచ్చిన హామీలను మాత్రం తప్పకుండా గ్రౌండ్ చేస్తామని చెబుతున్నారు. అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టించడం సాధ్యమవుతుందని, అందుకే మరో ఇరవై ఏళ్లు తమకే అధికారం ఇవ్వాలని చంద్రబాబు జనాలను కోరుతున్నారు.