Ap Cabinet Meeting : కేబినెట్ భేటీలో మంత్రులకు చంద్రబాబు సుతిమెత్తని హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అయితే మంత్రివర్గం సమావేశంలో అధికారిక చర్చలు ముగిసిన అనంతరం మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలిసింది. ఎవరూ అనవసరంగా మాట్లాడి కొత్త వివాదాలను తేవద్దని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రుల పనితీరుపై తాను అంచనా వేస్తున్నానని, మార్కుల ప్రాతిపదికన త్వరలో ఈ విషయాన్ని వెల్లడిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏడాది అవుతున్నా ఇంకా కొందరు మంత్రులు గాడిలో పడకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రులు తమ శాఖలపై పూర్తి పట్టు సాధించాలని, అలాగే తమకు అప్పగించిన జిల్లా ఇన్ ఛార్జి బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు...
మంత్రులు కేవలం జిల్లాల పర్యటనకు వెళ్లి ఏదో వెళ్లి వచ్చామని అంటే సరిపోదని, అక్కడ ముఖ్యనేతలతో పాటు కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని నేతలకు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ లేకుండా ఉండేలా చూడాలని చంద్రబాబు కోరారు. ఇలా ఒకసారి వెళ్లి వచ్చిన తర్వాత ఇక జిల్లాకు వెళ్లకుండా అమరావతిలోనే ఉండిపోవడం కూడా సరికాదని, కార్యకర్తలు, నేతలు చెప్పిన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ ఫాలో అప్ చేయాలని, వెంటపడి కార్యకర్తలకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. చాలా మంది మంత్రులు ఏదో సమావేశాలు ఏర్పాటు చేశామని, సమస్య పరిష్కారం అయిందని మౌనంగా ఉంటున్నారని, కానీ సమస్యలు మళ్లీ మొదటికి రావడం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఎవరూ మాట్లాడవద్దంటూ..
ఇక మద్యం కుంభకోణం విషయంలో ఎవరూ మాట్లాడవద్దని కూడా మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. అనవసరంగా మాట్లాడితే అది పక్కదారి పడుతుందని, దర్యాప్తు సంస్థలపై ప్రభావం చూపుతుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిష్పక్షపాతంగా జగన్ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తున్నప్పుడు వాళ్ల పనిని వాళ్లను చేసుకోనివ్వాలని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా ప్రతి విషయంలో అధ్యయనం చేసి మరీ స్పందించాలని కూడా చంద్రబాబు అన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి స్పందించవద్దని కూడా చంద్రబాబు తెలిపారు. ఇక రేషన్ బియ్యాన్ని ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకోవాలని, రేషన్ వాహనాలను నిలిపేయాలని కూడా కోరారు. అయితే వితంతువులకు,వృద్దులకు, వికలాంగులకు మాత్రం ఇంటికి వెళ్లి బియ్యం అందించాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.